ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో అందంగా మెరిసే పండ్లు విపరీతంగా పెరిగాయి. ప్రత్యేకించి ఆపిల్ పండ్లు (Apples) అత్యంత ఆకర్షణీయంగా కనిపించేందుకు వ్యాపారులు రసాయనాలతో, ప్లాస్టిక్ లేదా మైనపు పూతలతో కృత్రిమంగా తయారు చేస్తున్నారు. వీటిలో షెల్లాక్, వాక్స్, కలర్ లాంటి పదార్థాలు వాడుతారు. అయితే వీటిని తినడం వల్ల మన శరీరానికి గణనీయమైన హానీ వాటిల్లే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇవి లివర్, కిడ్నీ వంటి ముఖ్య అవయవాలపై ప్రభావం చూపవచ్చు.
నకిలీ పండ్లను గుర్తించేందుకు చిట్కాలు
పండ్లు కొనేటప్పుడు అసాధారణంగా మెరిసిపోవడం, అతిగా గాఢమైన రంగు ఉండటం అనుమానాస్పద లక్షణాలు. సహజమైన ఆపిల్‌కు తేలికపాటి మెరుపు, సహజ వాసన ఉంటుంది. నకిలీ ఆపిల్‌కు రసాయనాల వాసన లేదా అసహ్యకరమైన వాసన రావచ్చు. అలాగే, ఆపిల్‌ను కోసి చూడటం, లోపలి రంగును గమనించడం ద్వారా కూడా నకిలీ పండ్లను గుర్తించవచ్చు. ఒక చిన్న ముక్కను నీటిలో వేసి పరీక్షించవచ్చు – అసలైన ఆపిల్ మునిగిపోతుంది, నకిలీ పండు తేలిపోతుంది.
సీజనల్ పండ్లవైపు మొగ్గు చూపాలి
నకిలీ పండ్ల బారిన పడకుండా ఉండాలంటే, సీజనల్ పండ్లు, కూరగాయలపై ఎక్కువగా ఆధారపడాలి. ఎందుకంటే, సీజన్‌లో లభించే పండ్లు పెద్దగా నిల్వ చేయాల్సిన అవసరం లేకపోవడంతో, అవి ఎక్కువగా రసాయనాలకు గురికాకుండా తాజాగానే లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిదే కాదు, నకిలీ పండ్ల వల్ల వచ్చే ముప్పును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి, భౌతిక ఆకర్షణకన్నా సహజత్వం పైనే నమ్మకముంచాలి.
Read Also : PV Sindhu: లాల్‌దర్వాజలో పీవీ సింధు ప్రత్యేక పూజలు..