Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కింది. ఇంటి సభ్యుల మధ్య పాత గొడవలు, గ్రాటిట్యూడ్ అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వంశీ, ముకేష్ మధ్య వాడీవేడి వాదనలు చోటుచేసుకున్నాయి. ఇక వంశీ చేసిన ఓ వ్యాఖ్యపై వర్షిణి తీవ్రంగా స్పందించింది. రామకృష్ణ, నరేష్ నామినేషన్లు కాస్త వినోదాన్ని పంచగా.. ముకేష్, వంశీ నామినేషన్లు మాత్రం హౌస్‌లో ఉద్రిక్తతకు దారితీశాయి.
Read Also :Sai Durga Tej: పెళ్లి పీటలెక్కబోతున్న సాయి దుర్గా తేజ్?
ఝాన్సీ గురించి బాధపడిన ముకేష్
నామినేషన్లకు ముందు వీకెండ్ ఎపిసోడ్‌లో జరిగిన పరిణామాలపై అమన్, ముకేష్ తదితరులు చర్చించుకున్నారు. రోహిత్ తన స్నేహాన్ని అర్థం చేసుకోలేదని, అందుకే అతడికి ఎగ్జిట్ ఓటు వేశానని అమన్ చెప్పాడు. మరోవైపు ముకేష్ కెమెరా ముందుకు వచ్చి తన చెల్లి ఝాన్సీ గురించి భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెకు జీవితంలో అంతా మంచే జరగాలని, ప్రతి సందర్భంలోనూ తాను అండగా ఉంటానని చెప్పాడు.
వంశీ వర్సెస్ ముకేష్.. మాటల యుద్ధం
ముందుగా వంశీ.. ముకేష్‌ను నామినేట్ చేశాడు. ఇంట్లో అతడి ప్రవర్తన సరిగా లేదని, మాటలు జారుతున్నాడని విమర్శించాడు. ‘కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నావ్’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో గతంలో జరిగిన గ్రాటిట్యూడ్ గొడవను కూడా ప్రస్తావించాడు. ఆ తర్వాత వర్షిణి కారణంగా ముకేష్ తనను సేవ్ చేశాడని వంశీ అనడంతో.. ఆ రోజు ముకేష్ అలా చేయొద్దని తాను చెబుతున్నప్పుడు వంశీ ఎందుకు అడ్డుకున్నాడని వర్షిణి ప్రశ్నించింది. తనకు కూడా ముకేష్ సహాయం అవసరమైందని వర్షిణి వాదించింది. అలాగే అర్ధరాత్రి వరకు మాట్లాడటం వల్ల తన నిద్రకు అంతరాయం కలుగుతోందని వర్షిణి విషయంలో వంశీ మరో కారణాన్ని ప్రస్తావించాడు.
వంశీని నామినేట్ చేసిన సుధీర్
ఆ తర్వాత సుధీర్.. వంశీని నామినేట్ చేశాడు. మూడో వారంలోనే రూ.35 లక్షలు ఇస్తే ఇంటి నుంచి వెళ్లిపోతానని వంశీ అన్న విషయాన్ని గుర్తుచేశాడు. ఇక్కడ ఎంతకాలం ఫేక్‌గా నటిస్తావని ప్రశ్నించాడు. అందుకు వంశీ కూడా సుధీర్ నటనను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చాడు. ఇదే సమయంలో జంతువుల ప్రవర్తన గురించి వంశీ చేసిన వ్యాఖ్యలపై ముకేష్ స్పందించాడు. అనంతరం రోహిత్‌ను స్నేహితుడిగా చెప్పుకుంటూనే అతడికి ఎగ్జిట్ ఓటు వేసినందుకు అమన్‌ను సుధీర్ నామినేట్ చేశాడు. తాను ఎవరినైనా స్నేహితుడిగా భావించినంత మాత్రాన వారు కూడా అలాగే భావించాలని లేదని అమన్ సమాధానమిచ్చాడు.
ముకేష్ ఆటపై శ్వేత అసంతృప్తి
శ్వేత.. ముకేష్‌ను నామినేట్ చేస్తూ గతంలో కనిపించిన ఆటతీరు ఇప్పుడు కనిపించడం లేదని చెప్పింది. అనవసరంగా అగ్రెసివ్ అవుతున్నాడని, అతడి మాటలు తనను ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొంది. మరోవైపు స్టార్ ఇస్తానని చెప్పి చివరకు దాని విలువ లేకుండా చేశాడంటూ అమన్‌ను కూడా నామినేట్ చేసింది.
వర్షిణిని టార్గెట్ చేసిన నీతూ
నీతూ.. వర్షిణిని నామినేట్ చేసింది. తన తమ్ముడు రోహిత్ వర్షిణికే స్టార్ ఇస్తాడని ఆమెకు ముందే తెలుసని ఆరోపించింది. స్టార్ వర్షిణికి వస్తే, డబ్బులు తనకు రావాలనేలా రోహిత్‌తో ముందుగానే మాట్లాడుకున్నారని నీతూ పేర్కొంది. అయితే అలాంటి ఒప్పందం ఏదీ లేదని వర్షిణి ఖండించింది. ఆ తర్వాత వంశీని నామినేట్ చేసిన నీతూ.. వంటగదిలో ప్రశాంతంగా ఉంటూ బయట మాత్రం గట్టిగా అరుస్తున్నాడని విమర్శించింది. అతడి అరుపుల వల్ల తాను ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. దీనికి వంశీ కూడా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తానని సమాధానమిచ్చాడు.
‘అందరూ కలిసి కులుకుతున్నారు’.. వర్షిణి ఆగ్రహం
ముకేష్ కూడా వంశీని నామినేట్ చేస్తూ అతడికి శారీరక బలం ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు తీవ్రస్థాయికి చేరాయి. చెల్లిని బయటకు పంపించి అందరూ కలిసి కులుకుతున్నారని వంశీ ముకేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఈ మాటపై వర్షిణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘కులుకడమా? ఏం మాట్లాడుతున్నావ్?’ అంటూ ప్రశ్నించింది. అందరూ కలిసి నవ్వుకుంటున్నారనే అర్థంలోనే తాను ఆ మాట అన్నానని, మరో అర్థం తీసుకోవద్దని వంశీ వివరణ ఇచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యతో నామినేషన్స్‌లో వాతావరణం మరింత వేడెక్కింది.
Bigg Boss 10: ముకేష్, నీతూలను నామినేట్ చేసిన ఆర్కే
చివరగా ఆర్కే వచ్చి ముకేష్, నీతూలను నామినేట్ చేశాడు. ర్యాక్స్, సాక్ టాస్క్ సమయంలో తనకు సహాయం చేయకుండా దేబ్జానీపై ఉన్న కోపంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని ముకేష్‌పై ఆరోపణలు చేశాడు. తనకు రెండుసార్లు ఎగ్జిట్ ఓటు వేసి ఇప్పుడు గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించాడు. అలాగే రేషన్ మేనేజర్‌గా నీతూ విఫలమైందని, ప్రతి విషయానికీ ఎమోషనల్ అవుతోందని విమర్శించాడు. తనకు రెండుసార్లు ఎగ్జిట్ ఓటు ఎందుకు వేసిందని నీతూను ఆర్కే అడిగాడు. అందుకు రోహిత్ తన తమ్ముడని, ఆ సమయంలో అతడే తనకు బలంగా కనిపించాడని అందుకే ఓటు వేసినట్లు నీతూ సమాధానమిచ్చింది. ఇలా తొమ్మిదో వారం నామినేషన్స్‌లో పాత వివాదాలు, వ్యక్తిగత విమర్శలు, కొత్త ఆరోపణలతో బిగ్ బాస్ హౌస్ వేడెక్కింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :