వృద్ధ దంపతులు సైబర్ మోసానికి గురయ్యారు. రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. సంతానం లేకపోవడంతో ఎవరిపై ఆధారపడటం ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. జరిగిన సైబర్ మోసం గురించి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. 82 ఏళ్ల డియోగ్జెరోన్ శాంతన్ నజరెత్, 79 ఏళ్ల ఫ్లావియానా వృద్ధ దంపతులు. ఖానాపూర్‌లోని బీడీ గ్రామంలో వారు నివసిస్తున్నారు. మార్చి 27న ఫ్లావియానా బెడ్‌పై మరణించి ఉండటాన్ని పొరుగువారు గమనించారు. రిటైర్డ్ మహారాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉద్యోగి అయిన డియోగ్జెరోన్ శాంతన్ మృతదేహాన్ని ఆ ఇంటి అండర్ గ్రౌండ్ నీటి ట్యాంక్‌లో గుర్తించారు. ఆయన మెడ, చేతి మణికట్టుపై కత్తి గాయాలున్నాయి.

మోసపూరితంగా సిమ్ కార్డు కొనుగోలు
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డియోగ్జెరోన్ శాంతన్ రాసిన సూసైడ్ నోట్‌ను పరిశీలించారు. సుమిత్ బిర్రా, అనిల్ యాదవ్ పేర్లను ఆ నోట్‌లో ఆయన పేర్కొన్నారు. అందులోని వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన టెలికాం డిపార్ట్‌మెంట్ అధికారిగా చెప్పుకున్న సుమిత్ బిర్రా అనే వ్యక్తి డియోగ్జెరోన్‌కు ఫోన్ చేశాడు. ఆయన పేరు మీద మోసపూరితంగా సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వేధింపులు, అక్రమ ప్రకటనలకు ఆ సిమ్ కార్డును వినియోగిస్తున్నట్లు ఆరోపించాడు.
భయపెట్టి, వేధించి రూ. 50 లక్షలకు పైగా వసూలు
ఆ తర్వాత క్రైమ్ బ్రాంబ్‌కు చెందిన అనిల్ యాదవ్ వ్యక్తికి ఫోన్ కాల్‌ను ట్రాన్స్‌ఫర్ చేశాడు. సిమ్ కార్డ్ దుర్వినియోగంపై చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని డియోగ్జెరోన్ శాంతన్‌ను అతడు బెదిరించాడు. ఆయన ఆస్తి, ఆర్థిక వివరాలను అడిగి తెలుసుకున్నాడు. భయపెట్టి, వేధించి రూ. 50 లక్షలకు పైగా వసూలు చేశారు. మరోవైపు సైబర్ నేరగాళ్లు తమను మరింతగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని డియోగ్జెరోన్ శాంతన్ ఆ సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. జూన్ 4న రూ.7.15 లక్షలకు గోల్డ్ లోన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ఆ అప్పు తీర్చాలి. బంగారాన్ని విక్రయించాలి. ఆ డబ్బును వారికి చెల్లించాలి’ అని ఆ నోట్‌లో రాసి ఉంది.
మమ్మల్ని ఆదుకునే వారు ఎవరూ లేరు
అలాగే తన స్నేహితుల నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నట్లు డియోగ్జెరోన్ శాంతన్ ఆ నోట్‌లో ప్రస్తావించారు. భార్య బంగారు గాజులు, చెవిపోగులు విక్రయించి వారికి తిరిగి చెల్లించాలని అభ్యర్థించారు. ‘మేం వృద్ధులం. మమ్మల్ని ఆదుకునే వారు ఎవరూ లేరు. ఎవరి దయాదాక్షిణ్యాలపై బతకడం ఇష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ నోట్‌లో ఉంది. అలాగే మెడికల్ కాలేజీ విద్యార్థుల చదువు కోసం తమ మృతదేహాలను డొనేట్ చేయాలని అందులో కోరారు.
భార్య ఫ్లావియానా విషం సేవించి ఆత్మహత్య
కాగా, సైబర్ నేరగాళ్లతో జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలను డియోగ్జెరోన్ మొబైల్ ఫోన్‌లో పోలీసులు గుర్తించారు. ఆ మొబైల్ ఫోన్, సూసైడ్ నోట్, ఆత్మహత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన భార్య ఫ్లావియానా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. వృద్ధ దంపతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఇద్దరు నిందితులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, సైబర్ మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.