తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఏపీసెట్ పరీక్షకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కన్వీనర్ కోటా సీట్లను నిలిపివేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్షా కేంద్రాలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ఏపీ రాష్ట్రంలో ఉన్న పరీక్షా కేంద్రాలను తొలగిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో పరీక్షా కేంద్రాల తొలగింపు
ప్రతీ ఏటా తెలంగాణ ఈఏపీసెట్‌లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పరీక్షకు హాజరవుతుంటారు. అయితే, ఈసారి ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో 15% సీట్లు రద్దు చేసిన నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయకూడదనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలో ఏర్పాటు చేయనున్న కేంద్రాలను కూడా రద్దు చేశారు. గతంలో ఏపీ నుంచి 3,000 మందికిపైగా విద్యార్థులు తెలంగాణ ఈఏపీసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకునేవారు. ప్రతీయేట తెలంగాణ, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు దాదాపు 55 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చేవి.
దరఖాస్తుల స్వీకరణ
ఈఏపీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 2వ తేదీ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజునే 5,010 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,116 మంది ఇంజినీరింగ్ విభాగానికి, 1,891 మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఆలస్య రుసుము
ఆన్‌లైన్ దరఖాస్తుల సవరణలకు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు అవకాశం ఇస్తారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9వరకు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక వ్యవసాయ, ఫార్మసీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29, 30 తేదీలలో జరుగుతుంది, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మే 2 నుంచి 5 వరకు ఉంటుంది. హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 19 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.