ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది.

జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం
ఉచిత బస్సు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసేలా ఆరు కీలక హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లతో పాటుగా.. బడ్జెట్ లో మరో రెండు పథకాలకు నిధులు కేటాయించారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు.
ముగ్గురు మంత్రులతో కమిటీ
పథకం అమలు పై ఆ తరువాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు. అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2,000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆర్టీసీ పై భారం మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు.