2024 జూన్ 5న వారం రోజుల అంతరిక్షయానానికి వెళ్లిన సునీతా విలియమ్స్ అండ్ విల్మోర్‌లు.. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-ఎక్స్‌తో కలిసి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది నాసా. సునీత అండ్ టీమ్‌ని ఫ్లోరిడా తీరంలో సేఫ్‌గా ల్యాండ్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత, విల్మోర్‌లు.. చెక్కుచెదరని విల్‌పవర్‌తో తిరిగి భూమిపైకి చేరుకున్నారు. ఆ కొద్దిసేపటికే సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండైంది. ముందుగా ప్రకటించిన టైమ్‌కే.. అంటే సరిగ్గా 3గంటల 27నిమిషాలకే వ్యోమనౌక.. సేఫ్‌గా దిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్
అంతరిక్ష అన్వేషణ అంటే మానవ సామర్థ్యం పరిమితులను అధిగమించడం.. కలలు కనే ధైర్యం.. ఆ కలలను వాస్తవంగా మార్చే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండటం.. ఒక మార్గదర్శకురాలు, ఐకాన్ అయిన సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా ఈ స్ఫూర్తిని ప్రదర్శించారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ఖచ్చితత్వం అభిరుచి కలిసినప్పుడు.. దానికి తోడు సాంకేతికత – పట్టుదల కలిస్తే ఏమి జరుగుతుందో వారు చూపించారు..’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు..కాగా.. అంతకు ముందు భారత్‌కు రావాలని వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. వేల మైళ్ల దూరంలో ఉన్నా మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని అన్నారు. సునీతా విలియమ్స్‌కు ఈ నెల ఒకటిన ప్రధాని రాసిన లేఖను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఎక్స్‌లో షేర్ చేశారు.

భారత్‌లోనూ సంబరాలు
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, గోర్బునోవ్ కూడా భూమి పైకి చేరుకున్నారు. సునీత విలియమ్స్ భూమ్మీద అడుగుపెట్టగానే అటు అమెరికా.. ఇటు భారత్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. గుజరాత్‌తోపాటు.. పలు రాష్ట్రాల్లో టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు.