చాలామంది మద్యం తాగేటప్పుడు స్టార్టర్లుగా చికెన్ తినడం ఆనవాయితీగా మార్చుకున్నారు. స్పైసీ, ఫ్రైడ్, గ్రిల్డ్ ఇలా అనేక రకాల చికెన్ వంటకాలను అల్కహాల్‌తో కలిపి తింటూ ‘కిక్కు’ ఎక్కువగా వస్తుందని భావిస్తారు. మాంసాహారం, ముఖ్యంగా చికెన్, మద్యం తాగేటప్పుడు రుచిగా ఉండటమే కాకుండా, ఆకలిని కూడా తక్కువ చేస్తుంది. అయితే, దీని ప్రభావం శరీరంపై ఎలా ఉంటుందో తెలుసుకోవడం అవసరం.

మద్యం + కొవ్వు కలయిక ప్రభావం
చికెన్‌లో సహజంగా కొవ్వు అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి, ఫ్రైడ్ చికెన్ లేదా బట్టర్ చికెన్ వంటి వంటకాలు మరింత అధిక కొవ్వును కలిగి ఉంటాయి. మద్యం తాగినప్పుడు ఈ అధిక కొవ్వు, ఆల్కహాల్ జీర్ణక్రియను నెమ్మదిగా మార్చేస్తాయి. మద్యం శరీరంలో కొవ్వును త్వరగా సుంకించుకోవడానికి కారణమవుతుంది. దీని వల్ల కొవ్వు కాలేయంలో నిల్వ అయి, దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చిన నిజాలు
అంతర్జాతీయంగా జరిగిన కొన్ని అధ్యయనాల్లో, మద్యం తాగేటప్పుడు అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకునేవారిలో 30% మందికి కాలేయ సమస్యలు ఏర్పడినట్లు తేలింది. అధిక కొవ్వుతో పాటు ఆల్కహాల్ లివర్ పనితీరును దెబ్బతీసి, కొవ్వును శరీరంలో నిల్వ అయ్యేలా చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
మద్యం తాగేటప్పుడు పూర్తిగా చికెన్ తినకుండా ఉండలేకపోతే, దీని ఆరోగ్యకరమైన రూపాన్ని ఎంచుకోవడం మంచిది. తక్కువ మసాలా, నూనె లేని గ్రిల్డ్ చికెన్‌ను 100-150 గ్రాముల పరిమితిలో మాత్రమే తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతూనే, అదనపు కొవ్వు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల బారినపడకుండా ఉండవచ్చు. అదనంగా, ఆల్కహాల్ తాగేటప్పుడు ఎక్కువగా నీరు తాగడం, తాజా కూరగాయలు లేదా ప్రోటీన్ అధికంగా ఉండే తక్కువ కొవ్వు ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలైన ఎంపిక.