శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాయామం చేయడం అవసరం. రోజూ కొంత సమయం నడక, జాగింగ్, యోగా లేదా జిమ్ వంటివాటికి కేటాయిస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. వ్యాయామం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రయోజనాలన్నింటికీ వ్యాయామాన్ని సరిగ్గా, సమయానుసారంగా చేయాలి.
అందరికీ వర్కౌట్ సరిపోదు
అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు వ్యాయామం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్స (సర్జరీ) చేయించుకున్నవారు తక్షణమే శరీరానికి ఒత్తిడి ఇచ్చే వ్యాయామాలు చేయడం ప్రమాదకరం. ఇందువల్ల అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ బ్లీడింగ్) ఏర్పడే అవకాశముంది. అలాంటి వారు డాక్టర్ సూచనల మేరకు వ్యాయామాన్ని ముందుకు సాగించాలి.

శరీర నొప్పులు, జ్వరం ఉన్నవారికి హెచ్చరిక
ఎముకల సమస్యలు లేదా కండరాల నొప్పులు ఉన్నవారు కూడా వ్యాయామం చేయడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి ఇప్పటికే నొప్పి ఉన్నప్పుడు వ్యాయామం వల్ల సమస్య మరింతగా పెరగవచ్చు. అలాగే, జ్వరం లేదా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు పూర్తిగా కోలుకున్న తర్వాతే వ్యాయామం మొదలుపెట్టాలి. వీటిలో శక్తి హీనత ఉండే అవకాశం ఉండటంతో శరీరంపై అదనపు ఒత్తిడి వస్తుంది.
గుండె సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక జాగ్రత్తలు
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎలాంటి వ్యాయామం చేయాలో ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. కఠినమైన వ్యాయామాల వల్ల బీపీ పెరగడం, గుండె స్పందన వేగం అధికమవడం జరుగుతుంది. ఇది గుండెపోటుకు దారితీయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో లైట్ వాక్ లేదా రెగ్యులర్‌గా చేసే బ్రిదింగ్ ఎక్సర్సైజ్‌లు మాత్రమే చేయడం మంచిది. వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తేనేగాని, అనవసరంగా చేసి ప్రమాదాలను తలచేయకూడదు.