కరోనా వైరస్ ఎక్కడి నుంచి వ్యాపించిందనే విషయంపై అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ కొత్త అంచనాను వెలువరించింది. ఈ వైరస్ చైనా ప్రయోగశాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చని, జంతువుల నుంచి కాకపోవచ్చని వెల్లడించింది. అయితే ఈ అంచనాను పూర్తిగా విశ్వసించలేమని కూడా సీఐఏ హెచ్చరించింది. జంతువుల నుంచి కాక, పరిశోధనల మూలంగానే కోవిడ్ 19 మహమ్మారి బయటకు వచ్చినట్టు తమకున్న సమాచారమని ఒక ప్రతినిధి తెలిపారు.
డోనల్డ్ ట్రంప్ నియమించిన సీఐఏ కొత్త డైరక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వెల్లడించిన మొదటి విషయం ఇదే. వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే కోవిడ్ 19 లీకై ఉండొచ్చనే వాదనకు ర్యాట్‌క్లిఫ్ ఎప్పటి నుంచో అనుకూలంగా ఉన్నారు. ట్రంప్ తొలిపాలనా కాలంలో ఆయన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరక్టర్ గా పనిచేశారు. మొదటి కోవిడ్ కేసులు నమోదైన హుయానన్ మాంసం మార్కెట్ ఈ ఇనిస్టిట్యూట్‌కు కేవలం 40 నిమిషాల ప్రయాణ దూరంలో వుందని అన్నారు.

‘సీఐఏ చురుకుగా లేదు’
బ్రెయిట్ బార్ట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వైరస్ పుట్టుకపై సీఐఏ తటస్థ అభిప్రాయాలను వదులుకోవాలని, కచ్చితమైన పక్షాన్ని తీసుకొని చురుకుగా పని చేయాలని కోరుకుంటున్నట్లు ర్యాట్‌క్లిఫ్ తెలిపారు. ‘అమెరికాకు అనేకానేక విషయాల్లో చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు మీద దృష్టి సారించాలని నేను ఇప్పటికే పలు సార్లు చర్చించాను. కొన్ని మిలియన్ల అమెరికన్లు తమ ప్రాణాలు కోల్పోడానికి గల కారణం తెలియాలి, ఈ విషయంపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోవిడ్ మూలాలను కనుక్కునేందుకు చురుకుగా ఎందుకు పని చేయడంలేదు? ఇది నేను ఒక్క రోజులో చెయ్యగలిగే పని’ అని ర్యాట్‌క్లిఫ్ అన్నారు.కానీ కొత్తగా విడుదల చేసిన ఈ నివేదికలోని సమాచారం తాజాగా కనుగొన్నది కాదని యూఎస్ అధికారులు వెల్లడించారు. కోవిడ్ -19 ల్యాబ్ నుంచి లీకైందనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఇది ల్యాబ్ నుంచి లీకైందనే విషయంపై శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ వాదనను నమ్మేందుకు తగిన ఆధారాలు లేవని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అమెరికా తమపై చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగా ఈ ల్యాబ్ థియరీని సృష్టించిందని గతంలో చైనా ప్రభుత్వం ఆరోపించింది.