Shravan masam:భారతదేశంలో కొన్ని చోట్ల సూర్యమానం మరికొన్ని చోట్లచాంద్రమానం అనుసరించడం జరుగుతోంది. ఆ ప్రకారం నెలలు,వారాలు, పర్వదినాలను నిర్ణయిస్తారు.మన హిందూ పంచాంగం ప్రకారం సంవత్సరానికి పన్నెండు నెలలు (months) ఉన్నాయి. చైత్ర మాసంతో ఆరంభమయ్యే ఈ నెలలు ఫాల్గుణ మాసంతో ముగుస్తాయి. వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని కొన్ని మాసాలను శుభప్రదమైనవిగా మరికొన్నింటిని శూన్యమాసాలుగా నిర్ణయించడం జరిగింది. శుభప్రదమైన నెలలో ఒకటి శ్రావణ మాసం. పంచాంగం ప్రకారం అయిదవదైన శ్రావణం ఆంగ్ల నెలలు జులై-ఆగస్టు మధ్యలో వస్తుంది. పౌర్ణమి రోజున ఉండే నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. శ్రావణంలో పౌర్ణమి నాడు శ్రవణా నక్షత్రం ఉండటం వలన శ్రావణ మాసం అయ్యింది. కార్తికం మాదిరిగా శ్రావణం కూడా హరిహర ప్రియమాసం. శ్రావణ మాస ప్రస్థావన స్కంద పురాణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
శ్రావణ మాసం శివకేశవ ప్రియమైనది మాత్రమే కాదు ముల్లోకాలను లాలించి, పాలించే అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైన నెల.శ్రావణ మాసంలో వర్షాలు (rains) అధికంగా కురుస్తాయి. అన్నదాతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగాశ్రావణ మాసాన్ని ‘శుభ మాసం’ అని అంటారు. కొందరు నభో మాసం’ అని కూడా పిలుస్తారు. నభో అంటే ఆకాశం అని అర్థం. అంటే ఆకాశమంత గొప్పది అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ నెలలో ఎన్నో పర్వదినాలు. సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు, అమావాస్య, పౌర్ణమి, చతుర్థి, పంచమి, అష్టమి, ఏకాదశి, ద్వాదశి ఇలా అన్నీ పవిత్రమైనవే! మహిళలు ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, నోములు కుటుంబ క్షేమం కోసం ఆచరిస్తారు.
చంద్ర ప్రభావం
చంద్రుడు మన మనస్సు, ఆలోచనల మీద అధిక ప్రభావం చూపిస్తాడు అని చెబుతున్నది జ్యోతిష్య శాస్త్రం. శ్రావణం చంద్ర మాసం. చంద్రుడు అత్యంత చంచలుడు అవడం వలన చంచల మనస్సు చెడు ఆలోచనలురావడం, అవి దుష్ఫలితాలకు దారి తీయడం జరుగుతుంది.
అలాంటి వాటిని దూరం చేయడానికి, ధర్మాచరణ కోసం, మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి అనిశ్చిత ప్రభావం మాసంలో అనేక పండుగలు వస్తాయి. ఈ పర్వదినాలలో వలన కలిగే అనారోగ్యాల బారి నుండి కాపాడుకోడానికి ఈచేయవలసిన ఆచారాల పాలన వలన మానసిక, శారీరక, జీవిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
శ్రావణ మాస పురాణ గాథ
దేవదానవులు ఇద్దరూ కలిసి క్షీరసాగర మథనం చేసిన విషయం మనందరికీ తెలిసినదే! అమృతం ఉద్భవించడానికి ముందు కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, శ్రీమహాలక్ష్మి, శ్రీ ధన్వంతరి అవతరించారు. అదే క్రమంలో లోకాలను నాశనం చేయగల హాలాహలం అంటే విషం
కూడా వెలికి వచ్చింది. లయకారకుడైన పరమేశ్వరుడు లోకక్షేమం కోసం హాలాహలాన్ని స్వీకరించారు. విషం గొంతులో నిలపడం వలన స్వామి నీలకంఠుడు అయ్యారు. ఆయనను చల్ల బరచడానికి దేవతలు శిరస్సున గంగ, చంద్రుని ఉంచారు అని పురాణ గాథ తెలియచేస్తోంది.
అందుకనే కార్తికంలో మాదిరి శ్రావణంలో కూడా శివాలయాలలో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.
కన్వర్ యాత్ర
ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేసే ఈ యాత్ర ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో భక్తులు దీక్ష తీసుకొని సమీప నదిలోని నీటిని రెండు పాత్రలలో నింపుకొంటారు. పాత్రలను కావడిలో అమర్చి “బోల్ బం అంటూ కాలినడకన తాము నిర్ణయించుకొన్న శైవ క్షేత్రానికి యాత్ర చేస్తారు. కావడిలో ఉంచిన నీటితో గంగాధరునికి అభిషేకం చేయడంతో దీక్ష యాత్ర రెండూ పూర్తి అవుతాయి. ఈ యాత్ర ఆదివారం ఆరంభించి సోమవారం సాయంత్రానికి ముగించేలా ప్రయాణం అవుతారు. దక్షిణ
భారతదేశంలో శివాలయాలలో రుద్రాభిషేకాలను నిర్వహిస్తుంటారు.

మంగళ గౌరీ వ్రతం
శ్రావణ మాసంలో మహిళలు సౌభాగ్యం, కుటుంబ, వంశాభివృద్ధి కోసం తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ‘మంగళగౌరీ వ్రతం’. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి తెలిపారట. నారద మహర్షి సావిత్రీ దేవి చేత ఈ వ్రతం చేయించడం వలన ఆమెయమధర్మరాజు నుండి తన భర్త సత్యవంతుని ప్రాణాలను తిరిగి పొందగలిగినది. నెలలో వచ్చే నాలుగు/ఐదు మంగళ వారాలు స్త్రీలు భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులకు ఈ వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందుతారు.
శ్రావణ శుక్రవార పూజలు
స్థితికారకులైన లక్ష్మీనారాయణుల ప్రీత్యర్థం శ్రావణ మాసంలో పూజలు చేస్తారు. వాటిలో విశిష్టమైనది శుక్రవారం పూజలు. ఈ నెలలో ప్రతి శుక్రవారం పుణ్యస్త్రీలు విధిగా శ్రీలక్ష్మీ దేవి పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడుశ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రీసూక్తంలో ఈ వ్రత విధానం గురించి వివరించారు. సకల సంపదలకు కారణభూతురాలైన దేవదేవికి షోడశోపచార పూజలు చేస్తారు. విద్య, ధనం, ధాన్యం,సంతోషం, శాంతి, సత్సంతానం ప్రసాదించే తల్లిని యథాశక్తి ప్రార్థిస్తారు. అమ్మవారి స్వరూపాలుగా ముత్తైదువులకు పండ్లు, తాంబూలం ఇస్తారు. శుభకరం మంగళకరమైన శ్రీ వరలక్ష్మీ పూజ వలన సకల శుభాలు
పొందగలరన్నది శాస్త్రవాక్యం.
శనివారం ఇష్టదైవారాధన
ప్రతి ఇంటికీ ఒక కులదైవం ఉంటారు. నియమం తప్పకుండా కుల లేదా ఇంటి ఇలవేల్పును పూజించడం శుభకరం. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇలవేల్పుతో పాటు శ్రీమన్నారాయణుని అవతారాలైన శ్రీ వెంకటేశ్వర, శ్రీసత్యన్నారాయణ వ్రతాలను చేసుకోవడం విధాయకం అని
పెద్దలు చెప్పిన మాట. శ్రవణం శ్రీవారి జన్మ నక్షత్రం. శనివారం స్వామివారికిప్రీతిపాత్రమైన రోజు. అందువలన వ్రతాన్ని శనివారంచేసుకోవడం వలన మనోభీష్టాలు నెరవేరతాయి.
శ్రావణ పౌర్ణిమ
శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాలలో పౌర్ణమికి ఒకప్రత్యేకత ఉన్నది. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి,రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు.జంధ్యాన్నియజ్ఞోపవీతం అనిపిలుస్తారు. వేదకాలం
నుండి శ్రీ గాయత్రీస్వరూపం, బ్రహ్మసూత్రానికి ప్రతీకఅయిన యజ్ఞోపవీతాన్ని ధరించడం
ఆచారవంతులకు అనవాయితీ. పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతాన్నిశాస్త్రోక్తంగా ధరిస్తారు. ఆడబిడ్డలు తోడబుట్టిన సోదరుల, తమ పట్ల ఆప్యాయత చూపించే వారి అభివృద్ధిక్షేమం కోరుకొంటూ రక్షా బంధన్ పౌర్ణమినాడు కడతారు. రాఖీ పౌర్ణమిగా పిలవబడే ఈ రోజున రాఖీ కట్టడానికి ఒక విధానం ఉన్నది అని శాంతి కమలాకారం అనే శాస్త్రగ్రంథంతెలుపుతోంది. రాఖీ, లేదా రక్షను ఉదయం పూజామందిరంలో ఉంచి పూజించి మధ్యాహ్నం సమయంలో తమ శ్రేయోభిలాషులకు, ఆప్తులకు, సోదరుల ముంజేతికి కడితే పూర్తి ఫలితం ఉంటుంది.కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులలో శ్రావణ పౌర్ణమినాడు శ్రీ సత్యన్నారాయణ
వ్రతం బంధు-మిత్రులతో కలిసి శుభప్రదంగా చేసుకొనే ఆచారం నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది.

శ్రీ హయగ్రీవ
శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం విద్య, జ్ఞాన ప్రదాత శ్రీహయగ్రీవుడు. శ్రీమన్నారాయణుని మరో అవతారం శ్రీహయగ్రీవుడు. భాగవత పురాణం, మహాభారతం ఇత్యాది గ్రంథాలలో వేదరక్షకునిగా శ్రీ హయగ్రీవ నామం ప్రస్తావించారు. శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవ స్వామి లోకసంరక్షణార్ధం అవతరించిన రోజుగా చెప్పబడుతోంది. శ్రీవైష్ణవఆలయాలలో శ్రీ హయగ్రీవ జయంతి సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇవే కాకుండా శ్రావణ మాసంలో నాగచతుర్థి, నాగ పంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, శ్రీ వరాహ జయంతి, పొలాల అమావాస్య, శ్రీకృష్ణ జనాష్టమి కూడా హిందువులు వారి వారి సంప్రదాయాల ప్రకారం ఘనంగా చేసుకొంటారు. ఆయుష్షు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక పరివర్తన ప్రసాదించే శ్రావణమాసం సర్వ శుభకరం.
Read also:hindi.vaartha.com
Read also: