మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, పానగల్లు, పాలకుర్తి, వరంగల్ వేయి స్థంభాల గుడి, కాశిబుగ్గ శివాలయం, భద్రకాళి ఆలయం వంటి ప్రధాన శివాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత మెరుగుపరచాలని సూచించారు.

భద్రతా, వసతుల ఏర్పాట్లపై దృష్టి
శివరాత్రి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సంప్రదాయం ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్రహోమం, ప్రవచనాలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో క్యూలైన్ మేనేజ్‌మెంట్, తాగునీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ సరఫరా, వాహనాల పార్కింగ్, విద్యుద్దీపాల అలంకరణ, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మొహరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుకు ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల నిర్వహణను సమన్వయం చేసేందుకు హైదరాబాద్‌లోని ఎండోమెంట్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా వివిధ జిల్లాల్లో శివరాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, దేవాదాయశాఖ అధికారులు, పోలీస్ విభాగం సమన్వయంతో శివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.