ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.శనివారం (ఏప్రిల్ 5) జరిగిన రెండు మ్యాచ్‌లు దాదాపు ఏకపక్షంగా సాగాయి. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శక్తిమంతమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసింది. ఈ రెండు మ్యాచుల ఫలితాలతో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని జట్లు అగ్రస్థానాలకు ఎగబాకగా, మరికొన్ని జట్లు పడిపోయాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, నాలుగు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు రన్‌రేట్ +1.149గా ఉన్నది. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉండగా రన్ రేట్ +0.807గా ఉన్నది. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ ఉన్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదోస్థానంలో ఉంది. కేకేఆర్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి రెండు ఓడిపోయింది. నాలుగు పాయింట్లు, నెట్ రన్ రేట్ +0.070 వద్ద ఉన్నది.లక్నో నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఆరో స్థానంలో ఉండగా నాలుగు పాయింట్లు, నెట్ రన్ రేట్ +0.048గా ఉన్నది.
25 పరుగుల తేడా
ఢిల్లీపై చెన్నై 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఢిల్లీకి వరుసగా మూడో విజయం. ఆరు పాయింట్లు, +1.257 నికర రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా చెన్నై జట్టు రెండు పాయింట్లతో టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు, రన్‌రేట్ -0.891గా ఉన్నది. పంజాబ్‌పై విజయంతో రాజస్థాన్ సైతం పాయింట్ల పట్టికలో పైకి చేరింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన ఆ జట్టు రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు, -0.185 రన్‌రేట్ ఉన్నది. ఇక పంజాబ్ జట్టు మూడు స్థానాలు కోల్పోయింది. ఢిల్లీ-చెన్నై మ్యాచ్ తర్వాత, పంజాబ్ కింగ్స్ మొదటి స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. పంజాబ్ మూడు మ్యాచులు ఉండగా.. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు, +0.074 రన్‌రేట్‌గా ఉన్నది.
చివరి స్థానాల్లో
ఐపీఎల్‌లో నాలుగు జట్లు చివరి స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్ ఏడో స్థానంలో, ముంబై ఇండియన్స్ ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి. ముంబయి నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిచి మూడు ఓటములు, రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. రన్ రేట్ +0.108గా ఉన్నది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదవ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10వ స్థానంలో ఉన్నాయి. సన్‌రైజర్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిచింది. మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ జట్టు రెండు పాయింట్లు, -1.612 నికర రన్ రేట్‌తో చివరి స్థానంలో ఉంది.

సిఎస్ కె స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో పది వికెట్లు పడగొట్టాడు. రెండవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మూడు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.ఆ తర్వాత ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా,చెన్నైకి చెందిన ఖలీల్ అహ్మద్ ఉన్నారు. ఇద్దరూ చెరో ఎనిమిది వికెట్లు పడగొట్టారు. లక్నో నుంచి ఆడుతున్న శార్దూల్ ఏడు వికెట్లతో ఐదోస్థానంలో ఉన్నాడు.