దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత హర్షం వ్యక్తం చేస్తూ, నిందితులకు శిక్ష పడటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో సహకరించిన పోలీసులకు, న్యాయవాదులకు, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అమృత స్పందన
తీర్పు తర్వాత అమృత మాట్లాడుతూ, “ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది. ఇప్పటినుంచైనా పరువు పేరుతో జరిగే హత్యలు ఆగాలని ఆశిస్తున్నాను” అన్నారు. తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు రావడం లేదు, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరారు.
తీర్పు వివరాలు
నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు A2 నిందితుడికి ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నేరస్థులకు కఠినమైన శిక్షలు విధించడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ప్రణయ్ భార్య అమృత హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. ప్రణయ్ హత్య జరిగిన సమయంలో రంగనాథ్ నల్గొండ ఎస్పీగా ఉండి, కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేశారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా న్యాయం కోసం వెనుకడుగు వేయకుండా పనిచేశారు.
ప్రణయ్ తల్లిదండ్రుల భావోద్వేగం
ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించి, కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కేసు విచారణలో సహకరించిన డీఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. వంద మంది సాక్షులు, 1600 పేజీల ఛార్జ్ షీట్ తో అప్పటి ఎస్పీ రంగనాథ్ నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా వ్యవహరించారని కొనియాడారు.

కేసులో మరణశిక్ష
ఇక ఈ కేసులో మరణశిక్ష పడిన A2 నిందితుడు సుభాష్ శర్మను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. A3 నిందితుడు అస్గర్ అలీని గుజరాత్ సబర్మతి జైలుకు, మిగిలిన ఐదుగురు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు.ప్రణయ్ పరువు హత్య కేసు తీర్పుతో దేశవ్యాప్తంగా మరోసారి న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరిగింది.ప్రణయ్, అమృతలు ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నా, కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు. కానీ అమృత కుటుంబం ఇది ఒప్పుకోలేదు.కులాంతర ప్రేమను ఆమె కుటుంబం స్వీకరించలేకపోయింది. కుటుంబ సభ్యుల ఒత్తిళ్లను అధిగమించి, అమృత తన ఇష్టప్రకారమే 2018లో ప్రణయ్‌ను వివాహం చేసుకుంది.ఈ వివాహాన్ని అమృత తండ్రి మరుతి రావు, అతని కుటుంబం సమర్థించలేదు. తన కూతురు తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుటుంబానికి పరువునష్టం అని భావించాడు. పరువు పేరుతో తనే స్వయంగా హత్యకు కుట్ర చేసాడు. 2018, సెప్టెంబర్ 14న, మిర్యాలగూడలో అమృత గర్భిణిగా ఉన్న సమయంలో అందరూ చూస్తుండగానే ప్రణయ్‌ను కిరాతకంగా హత్య చేయించారు.