Prathyusha death case: నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. అలాగే నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. బెయిల్ కోరుతూ చేసిన విజ్ఞప్తిని కూడా కొట్టివేసింది. ఈ కేసులో ప్రత్యూష తల్లి సరోజినీ దేవి కూడా శిక్ష పెంచాలని అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పునే కొనసాగిస్తూ తుది నిర్ణయం తీసుకుంది.
Read Also:Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు

తీర్పుపై ప్రత్యూష తల్లి అసంతృప్తి
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానని పేర్కొన్న ప్రత్యూష తల్లి సరోజినీ దేవి, సరైన న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులో రాష్ట్ర పోలీసులు, సీబీఐ దర్యాప్తు సరైన దిశలో జరగలేదని, పోస్టుమార్టం నివేదికను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. మునుస్వామి పోస్టుమార్టం రిపోర్టులో ప్రత్యూషపై బహుళ వ్యక్తులు లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొనగా, కోర్టులు త్రిసభ్య వైద్యుల కమిటీ నివేదిక ఆధారంగా విచారణ జరిపాయని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రత్యూష కేసు నేపథ్యం
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రత్యూష తెలుగు సినిమా రంగంలో ఎదుగుతున్న సమయంలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. విచారణలో ప్రత్యూష తన ఇంటర్ చదువుతున్న సమయంలో సిద్ధార్థ రెడ్డితో ప్రేమ సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తీసుకున్న పరిస్థితిలో ఆసుపత్రిలో చేరగా, ప్రత్యూష మరుసటి రోజు మృతి చెందారు. సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పరీక్షల్లో వారు తీసుకున్న కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపినట్లు గుర్తించారు. ఆర్గానోఫాస్పేట్ విషం కారణంగానే ప్రత్యూష మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యుల కమిటీ నివేదిక ఇచ్చింది.
కోర్టుల తీర్పుల టైమ్‌లైన్
ఈ కేసులో సీబీఐ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) కింద చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
- 2004: సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.
- 2011: హైకోర్టు జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి, జరిమానాను రూ.50 వేలకు పెంచింది.
- 2012: ఇరు పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
- తాజాగా: సుప్రీంకోర్టు 14 ఏళ్ల విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు ఇచ్చింది.
సీబీఐ తరఫున న్యాయవాది నచికేత జోషి కేసులో సాక్ష్యాలు నిరూపితమయ్యాయని వాదించగా, సిద్ధార్థ రెడ్డి తరపు న్యాయవాదులు ఇద్దరూ కలిసి విషం తీసుకున్నారని, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణ సరైనదికాదని వాదనలు వినిపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: