కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంలో భర్త అడ్డుపడుతున్నాడని భావించిన ఓ మహిళ తన కట్టుకున్న వాడినే అత్యంత పాశవికంగా హత్య చేసింది. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి బావిలో పడేసిన దారుణ ఘటన ఇది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఘటన పూర్తి వివరాలు:
ఈ సంఘటన తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని కడశెట్టిహళ్లి గ్రామంలో జూన్ 24న జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కడశెట్టిహళ్లి గ్రామానికి చెందిన శంకరమూర్తి (50) తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య సుమంగళ తిప్టూరులోని కల్పతరు బాలికల హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కరదాలుశాంతే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సుమంగళ, ప్రియుడు నాగరాజుతో కలిసి అతడిని హతమార్చాలని పథకం పన్నింది.
హత్యకు పన్నిన పథకం:
పథకం ప్రకారం జూన్ 24న భర్త శంకరమూర్తి కళ్లలో సుమంగళ కారం పొడి చల్లింది. అనంతరం కర్రతో దారుణంగా కొట్టి, గొంతుపై కాలితో తొక్కి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కి, సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురువెకెరె తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలోని బావిలో పడేసింది.
పోలీసులు ఎలా ఛేదించారు?
శంకరమూర్తి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మొదట నొణవినకెరె పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు శంకరమూర్తి మంచం వద్ద కారం పొడి ఆనవాళ్లు, పెనుగులాట జరిగిన గుర్తులు గుర్తించి అనుమానంతో విచారణ ముమ్మరం చేశారు. సుమంగళ మొబైల్ కాల్ డేటా రికార్డులను పరిశీలించి, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది.
నిందితులపై కేసు నమోదు:
ఈ హత్యకు ప్రధానంగా బాధ్యులైన సుమంగళ మరియు నాగరాజుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వారి చర్యలు నేరపూరితంగా కాకుండా, మానవత్వాన్ని కల్లోలం చేసేలా ఉండటంతో స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Read also: Madan Mitra: కోల్‌కతా గ్యాంగ్‌రేప్‌పై టీఎంసీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
Uttarakhand: ఉత్తరకాశీలో ప్రకృతి విలయం..క్లౌడ్‌బరస్ట్‌కు 9 మంది గల్లంతు