Hyderabad: హైదరాబాద్ (Hyderabad) శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఓ విషాదకర సంఘటన అందరినీ కలిచివేసింది. ఒక చిన్నారి బాలిక చెరువులో ప్రమాదవశాత్తూ పడి మృత్యువాత పడింది. ఆమెను కాపాడేందుకు నీటిలోకి దూకిన యువకుడూ ఆమెతో పాటు ప్రాణాలు విడవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హృదయవిదారక ఘటన అదే ప్రాంతంలోని అనాజ్‌పూర్ చెరువు వద్ద చోటుచేసుకుంది.

వివరాలు:
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందినటువంటి చిన్నపురెడ్డి ప్రతాపరెడ్డి తన కుటుంబ సభ్యులతో అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసం ఉంటున్నాడు. వీళ్ళ బంధువులకు టిప్పర్లు ఉండడంతో అనాజ్‌పూర్ గ్రామంలో ప్రైవేట్ వెంచర్ల నిర్మాణం పనులను నడిపిస్తున్నారు.
ఘటన ఎలా జరిగిందంటే…
ప్రతాప్ రెడ్డి (Pratap Reddy) ఆదివారం సెలవు కావడంతో కూతురు ప్రణీతతో కలిసి ఆ చెరువు వద్దకు వెళ్లాడు. ప్రతాప్ రెడ్డి, కూతురు ప్రణీతతోపాటు బంధువు అయినటువంటి ఇంద్రసేనారెడ్డి (20) అనే యువకుడు కూడా వారి వెంట వెళ్లారు. అక్కడ ఒక వెంచర్ ఉండగా సమీపంలోనే ఇందిరా సాగర్ ఉంది. ఆ సమీపంలో ఆడుకునేందుకు వెళ్లినటువంటి ప్రణీత అలాగే కుటుంబ సభ్యులు కాసేపు సంతోషంగా ఫోటోలు దిగారు. అయితే, ఆడుకుంటున్న సమయంలో ఓ ప్రమాదవశాత్తూ ప్రణీత పక్కనే ఉన్న చెరువులోకి జారి పడింది. ఆమె కేకలు విన్న ఇంద్రసేనారెడ్డి ఒక్కసారిగా ఆమెను కాపాడేందుకు చెరువులోకి దూకాడు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
విషాదమయిన ముగింపు:
ఈత రాకపోయినా కూతురు, అలాగే అతని బంధువును కాపాడేందుకు ప్రతాపరెడ్డి చెరువులోకి దూకాడు. ఈ సమయంలో ఆయన కూడా మునిగిపోయాడు ఆ తర్వాత తన భార్య చీర కొంగు సహాయంతో బయటపడ్డాడు. అప్పటికే నీట మునిగిన స్పృహతప్పి పడిపోయిన ప్రతాపరెడ్డిని బయటకు తీసి హాస్పటల్ కు తరలించారు. వారి మృతదేహాలను స్థానికులు సహాయంతో వెలికితీయగా, వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
పోలీసుల దర్యాప్తు:
ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.