తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం లేఖలను అమలు చేయాలని సూచించినా, టీటీడీ బోర్డు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శించారు. తెలంగాణ భక్తులకు కూడా సమాన హక్కులు ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన వినతి మేరకు, ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1నుంచి అమలు చేయాలని నిర్ణయించినా, ఇంకా కార్యరూపం దాల్చలేదని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

టీటీడీ లెక్కలు – ఒత్తిడిపై వాదనలు
ప్రస్తుతం 75 వేల మంది భక్తులు రోజూ శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. వీటిలో 7500 టికెట్లు వీఐపీలకు కేటాయిస్తుండగా, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు 2000 టికెట్లు కేటాయిస్తున్నారు. తెలంగాణ నేతల లేఖలను పరిగణలోకి తీసుకుంటే రోజుకు అదనంగా 1100 టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అల్టిమేటం
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తప్పుదోవ పట్టించేలా టీటీడీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు అనుమతి ఇవ్వకపోతే, స్వయంగా తిరుమల వచ్చి తేల్చుకుంటామని హెచ్చరించారు.