స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. నష్టాలు తప్పవు. క్షణాల్లో పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. స్టాక్ మార్కెట్లపై పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని.. ఆర్థిక నిపుణుల సలహాతో పెట్టుబడులు పెట్టాలి.
డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు
ఇంకా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అస్థిరతకు లోనవుతున్నాయి.

ఇప్పుడు సోమవారం రోజు కూడా దేశీయ స్టాక్ మార్కె్ట్ సూచీలు పతనం అవుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా నష్టంతో 77,300 మార్కు పైన కదలాడుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్ల పతనంతో 23,400 మార్కు దిగువన ఉంది.
ఏకంగా 20 శాతం పడిపోయిన స్టాక్
ఇలా మార్కెట్లు భారీగా పడుతున్న క్రమంలోనే కొన్ని స్టాక్స్ లాభాల్లో,, మరికొన్ని స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడు ఒక్కరోజే ఒక్క కారణంతో ఏకంగా 20 శాతం పడిపోయిన స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే తిలక్‌నగర్ ఇండస్ట్రీస్. ఇది ప్రముఖ విస్కీ బ్రాండ్.. మాన్షన్ హౌస్ పేరిట విస్కీ, జిన్, బ్రాండీ తయారీ, మార్కెటింగ్ సహా విక్రయం చేస్తుంటుంది. ఇప్పుడు తన మాన్షన్ హౌస్, సేవాయ్ క్లబ్ బ్రాండ్ పేరును ఇతర సంస్థలు వినియోగిస్తుండటంపై కంపెనీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా.. దీనిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో స్టాక్‌పై భారీగా ఎఫెక్ట్ పడింది. దెబ్బకు 20 శాతం కుప్పకూలిపోయింది.