తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక విషయాలను చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో చర్చించి, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి, దాన్ని కేంద్రానికి పంపించనున్నట్టు ఇప్పటికే ఆయన ప్రకటించారు.
భేటీలో చర్చించనున్న అంశాలు
బీసీ రిజర్వేషన్ల అమలు – రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధతనిచ్చి పంపే బిల్లుకు మోదీ ఆమోదం కోరనున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు – రాష్ట్ర హక్కుల కోసం కేంద్రం వద్ద నిధుల ఆమోదం కోరనున్నారు.
అభివృద్ధి పనులు – తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించి, త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు కోరనున్నారు.
కాంగ్రెస్ పెద్దలతో సమావేశం
ఈ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానం నేతలను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యూహాలపై కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంతో చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలాన్ని పెంచేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాల గురించి కూడా నేతలతో చర్చలు జరిగే అవకాశం ఉంది.

కేటీఆర్ విమర్శలు
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గతంలో 36 సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ సాధించిందేమీ లేదని, ఇప్పుడు 37వ సారి వెళ్లి ఏమి సాధిస్తారని ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీ పర్యటనలతో తెలంగాణకు ఏమాత్రం లాభం జరగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయంగా పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం లేక రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అధిష్ఠానం చుట్టూ తిరగడమా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు అనుమతులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అంశంపై ప్రధానితో చర్చించనున్నారు.దే విషయాన్ని బుధవారం(ఫిబ్రవరి 26) జరగబోయే భేటీలో ప్రధాని మోదీకి వివరించనున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని.. బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించనున్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు.