తమిళ సినిమాల్లో నాయికా ప్రాధాన్యత కలిగిన చిత్రాలను ఎంచుకోవడంలో సాయిధన్సిక ఎప్పుడూ ముందుంటుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘దక్షిణ’ సినిమా క్రైమ్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2024 అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇటీవల లైన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది.
కథ:
విశాఖలో వరుస హత్యలు జరుగుతున్నాయి. అందమైన అమ్మాయిలను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్యలు చేయడం.హంతకుడు తలను వేరు చేసి తీసుకెళ్లిపోవడం ఆ నగరాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఎక్కడికి వెళ్లినా, ఆల్రెడీ ఆధారాలను మరో పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చినట్టుగా వాళ్లు చెబుతూ ఉంటారు. తమకంటే ముందుగా ఆధారాలు సేకరిస్తున్నది ఒకప్పుడు హైదరాబాదులో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన ‘దక్షిణ’ అనే విషయం ఆమెకి అర్థమవుతుంది. అప్పట్లోనే రాజీనామా చేసిన దక్షిణ ఇప్పుడు ఎందుకు ఈ కేసు విషయంలో ఆసక్తిని కనబరుస్తున్నది ఆమెకి అర్థం కాదు. ముందుగా ఆ సంగతి తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. హైదరాబాద్‌లో జరిగిన హత్యలకు విశాఖలో జరుగుతున్న హత్యలకు సంబంధం ఏమిటి? చివరకు సైకోను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
సైకో కిల్లర్ సినిమా. ఇలాంటి కథలను గతంలో చాలా సార్లు చూశాం. అయితే, దర్శకుడు కొత్త కోణం చూపించే ప్రయత్నం చేశాడా? అంటే పెద్దగా ఏమీ కనపడదు. సినిమా ప్రారంభం నుంచీ, క్లైమాక్స్ వరకూ ఊహించదగిన మలుపులే కనిపిస్తాయి.దక్షిణ క్యారెక్టర్ మీద కథ నడుస్తుంది. సాయిధన్సిక తన హైట్, ఫిట్‌నెస్, పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటుంది. కానీ, పోలీస్ ఆఫీసర్ పాత్రను తీర్చిదిద్దిన తీరు అంత మంచిదిగా అనిపించదు. ప్రత్యేకంగా పోలీస్ యూనిఫామ్‌లో ఆమెను చూపించకపోవడం మైనస్. పాత్ర పరంగా ఆమె ఓ హై-లెవెల్ పోలీస్ ఆఫీసర్,దక్షిణ పెద్ద కేడర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్. ఆమె బంగ్లా ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ తన ఇంట్లోకి సైకో సులభంగా ప్రవేశించగలగడం అసహజంగా అనిపిస్తుంది.

కేసులను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్లు ఇంత అజాగ్రత్తగా ఉంటారా అని ఆశ్చర్యం కలగకమానదు. ఆమె పాత్ర ప్రవర్తించిన తీరు చూస్తే, ఇద్దరిలో ఎవరు సైకో? డౌట్ మనకి రాకుండా ఉండదు. సాయిధన్సిక ప్రధాన ఆకర్షణ. ఆమె స్టైల్, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.స్నేహా సింగ్, హిమశైలజ లాంటి ఇతర నటీనటులు తమ పాత్రల్ని న్యాయంగా పోషించారు.
డైరెక్టర్ తులసీ రామ్ ఓషో కొత్తగా ఏదీ ప్రయత్నించలేదు. ఇదివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ల కథానేపథ్యంలోనే సినిమా సాగుతుంది.డీఎస్‌ఆర్ మ్యూజిక్ ఓవరాల్‌గా ఓకే, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లోకల్‌గా అనిపిస్తుంది.ఫోటోగ్రఫీ & ఎడిటింగ్ పరంగా రామకృష్ణ సేనాపతి, వినయ్ పనిచేసిన విధానం ఓ మోస్తరు.