బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల జూబ్లీహిల్స్‌లో జరిగిన ర్యాష్ డ్రైవింగ్ ఘటనతో వార్తల్లో నిలిచారు. మంగళవారం (మే 13) మధ్యాహ్నం, ఆయన తన కారును రాంగ్ రూట్‌లో నడుపుతూ, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టేలా దూసుకెళ్లారు.

వివరాలు
వివరాల్లోకి వెళితే బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం (మే13) మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 వైపు నుంచి జర్నలిస్ట్‌కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్‌రూట్‌లో తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ హీరో కారును గమనించి అడ్డుకున్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడి పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. దీంతో కానిస్టేబుల్ కూడా భయంతో పక్కకు తప్పుకున్నాడని సమాచారం.
కేసు నమోదు
ఈ తతంగాన్నంతా ఒక వాహన దారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు బెల్లంకొండ శ్రీనివాస్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతున్నారు. సెలబ్రిటీలై ఉండి ఇలా ప్రవర్తిస్తారా? అంటూ హీరోను విమర్శిస్తున్నారు. కాగా ఇప్పుడిదే ఘటనలో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం (మే15) బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ విషయమై శ్రీనివాస్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 30న భైరవం విడుదల
మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన భైరవం సినిమా ఈనెల 30న విడుదల కానుంది. బెల్లంకొండ తెలుగు సినిమాల్లో కనిపించక సుమారు నాలుగేళ్లవుతోంది. ఈ గ్యాప్ ను పూరించేలా అతను భారీ మల్టీ స్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భైరవం. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్నీ భైరవం సినిమా మే 30న థియేటర్లలో రిలీజ్ కానుంది.