తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు విజయ్,(Vijay) తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ హితవు పలికారు. మధురైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటును విజయ్ పునరావృతం చేయవద్దని సూచించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరహాలో సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Gold Medalist: నీరజ్ చోప్రాకు ఇండియన్ ఆర్మీలో కీలక పదవి

అన్నాడీఎంకే కూటమిలో చేరాలని ఆహ్వానం, తీవ్ర హెచ్చరిక
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ కూటమి లక్ష్యమని ఉదయకుమార్ తెలిపారు. ఈ లక్ష్యంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఈ మెగా కూటమిలో చేరడానికి మరిన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ, ఇదే సరైన సమయంలో విజయ్ కూడా తమతో కలవాలని ఆహ్వానించారు. ఒకవేళ టీవీకే పార్టీ అన్నాడీఎంకే మెగా కూటమిలో చేరకపోతే, ఎన్నికల తర్వాత డీఎంకే ఆ పార్టీని నాశనం చేయడం తథ్యమని, తద్వారా టీవీకే రాజకీయంగా కనుమరుగవడం ఖాయమని ఉదయకుమార్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే విజయ్‌ను(Vijay) దేవుడు కూడా కాపాడలేడని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ రాజకీయ పరిణామాలు ఉదాహరణ
ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. “ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పొత్తులపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ, పవన్ కల్యాణ్ సరైన సమయంలో సరైన పొత్తు నిర్ణయంతో పార్టీని నిలబెట్టుకోవడమే కాకుండా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కీలకమైన అంశాన్ని విజయ్ తప్పకుండా గుర్తుంచుకోవాలి” అని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: