ఏపీ రాజకీయాల్లో బహిరంగ లేఖల ప్రస్థావన వస్తే ముందుగా గుర్తుకు వచ్చే పేరు చేగొండి హరిరామజోగయ్య అని చెప్పినా అతిశయోక్తి కాదేమో.2024 ఎన్నికలకు ముందు నుంచీ ఆయన వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. తొలుత టీడీపీతో జనసేన పొత్తు, ఆ సమయంలో పవన్ డిమాండ్ చేయాల్సిన సీట్ల సంఖ్య వరకూ ఆయన తన లేఖల్లో సూచించేవారు.ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జోగయ్య ఓ లేఖ రాశారు.ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి తర్వాత ఆ లేఖ విడుదల చేశారు. అందులో ప్రధానంగా కాపు రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించారు.
బహిరంగ లేఖ
కాపు సంక్షేమ అధ్యక్షుడు హరిరామజోగయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రాజధాని నిర్మాణం పేరిట ఇప్పటికే రూ. 50,000 కోట్లు ఖర్చు చేశారని, ఇంకా మరో రూ. 50,000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని లేఖలో ఆయన తెలిపారు.పరిపాలన సౌలభ్యం కోసం శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలకు ఖర్చు చేయడం సరైనదే అయినా, మిగతా జిల్లాల అభివృద్ధి కూడా సమానంగా జరగాలని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు.
ఉభయగోదావరి జిల్లాలను దత్తత
వారాహి సభలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటానని పవన్ చెప్పారని. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల్లోనూ అభివృద్ధికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉందని లేఖలో కోరారు జోగయ్య. ఇందులో భాగంగా విద్య, వైద్యం, రోడ్లు, వ్యాపారం, వ్యవసాయం, సాగు నీరు, తాగు నీరు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని ఉభయ గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం ఏయే పథకాలకు ఎంతెంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని జోగయ్య డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు ప్రతి ఏడాది ఎంత ఖర్చు చేశారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలు సంతోషిస్తారని సూచించారు.