అమానుషం: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య.. దుర్గ్‌ను వణికించిన దారుణం
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఓ అమానుష ఘటన. ఆరేళ్ల పాపపై లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేసిన కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన జరిగిన తీరు, పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, గ్రామస్తుల ఆవేదన – అన్నీ కలిపి ఒక మానవతా సంక్షోభానికి నిదర్శనంగా నిలిచాయి.
‘కన్యా భోజ్’ కోసం వెళ్లిన పాప.. తిరిగిరాలేదు
నవరాత్రి పర్వదినాల్లో ‘కన్యా భోజ్’ పేరుతో చిన్నారులకు పూజలు చేసి భోజనం పెట్టే సంప్రదాయం కొనసాగుతుంటుంది. అదే ఉద్దేశంతో ఆరు సంవత్సరాల బాలిక తన అమ్మమ్మ ఇంటికి 2025 ఏప్రిల్ 5న వచ్చింది. కానీ ఈ చిన్నారి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరలేదు. గంటలు గడుస్తున్నా బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తల్లితండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు.
ఇల్లు ఖాళీగా ఉండగా కీచక మామ పాశవికంగా ప్రవర్తన
పోలీసుల విచారణలో ఓ భయానక నిజం బయటపడింది. బాలిక అమ్మమ్మ ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో బాలికతో పాటు ఆమె మామ అయిన సోమేశ్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అదే సమయంలో తన కీచక స్వభావాన్ని బయటపెట్టిన సోమేశ్, బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత తన పాపతీరు బయటకు రాకూడదన్న ఉద్దేశంతో ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. చిన్నారి శరీరాన్ని పొరుగింటి వారు ఉపయోగించే కారులో పడేశాడు. ఆ కారు ఎప్పుడూ ఒకే స్థలంలో ఉండేదని, ఒక డోర్‌కు లాక్ లేకపోవడాన్ని ఉపయోగించుకున్నాడు.
కారులో దొరికిన చిన్నారి మృతదేహం
తరువాత పోలీసుల గాలింపు కొనసాగిన సమయంలో బాలిక మృతదేహం అదే కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల్లో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. ఆమె శరీరంపై గాయాలున్నాయని, వెలుగుచూశాయి. ఈ సమాచారంతో గ్రామస్థులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.
పోలీసుల అలసత్వంపై ప్రజల్లో ఆగ్రహం
నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత బాలిక బంధువులు, గ్రామస్థులు మోహన్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుటకు చేరుకున్నారు. మొదట ప్రశాంతంగా సాగిన ఆందోళన అనంతరం హింసాత్మకంగా మారింది. స్టేషన్‌పై రాళ్లు విసిరారు. పోలీసు వాహనాన్ని దహనం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రజలను తరిమేశారు.
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి స్పందిస్తూ, “ఇది అమానుషం… మానవతా విలువలకు తూటా వేసే ఘటన. నిందితుడిపై కఠిన చర్యలు తప్పవు,” అని హామీ ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వెళ్లి నివేదిక సమర్పించారు. సోమేశ్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. అతనిపై లైంగికదాడి, హత్య, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు.
చిన్నారి ఆత్మకి న్యాయం లభించాలన్న జనవేదిక
ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా మానవత్వాన్ని మంటగలిపేలా చేస్తున్నాయి. చిన్నారుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంట్లోనే బంధువులచేతిలో చిన్నారులు బలి కావడం గుండెను పిండి వేస్తోంది. సోమేశ్ వంటి పిశాచాలను కఠినంగా శిక్షించాలన్నది ప్రజల గళం. చిన్నారి ఆత్మకి న్యాయం కావాలి… ఇంకెవరూ ఇలా బలికాకూడదని అందరూ కోరుకుంటున్నారు.
READ ALSO: Attack: నడి రోడ్డు మీద గర్భిణీ భార్య పై భర్త దాడి