అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఇద్దరు బయలాజికల్ సెక్సెస్- మేల్ అండ్ ఫిమేల్‌ను మాత్రమే గుర్తించేలా తన విధానాలను సవరించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ- ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ విధానాలను అప్‌డేట్ చేసినట్లు వెల్లడించింది. మొన్నటివరకు ఉన్న థర్డ్ జెండర్ ఆప్షన్‌ను తొలగించినట్లు వెల్లడించింది. థర్డ్ జెండర్‌ను అధికారికంగా గుర్తిస్తూ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జారీ చేసిన ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దయినట్టవుతుంది.

ఇమ్మిగ్రేషన విధానం జాతీయ భద్రత అవకాశం
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీకి డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉన్నారని, ఈ క్రమంలోనే తాజా సవరణలు చోటు చేసుకున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ సెక్రెటరీ ట్రైసియా మెక్‌లాఘ్లిన్ తెలిపారు. మేల్, ఫిమేల్‌ను మాత్రమే ఇక గుర్తిస్తామని అన్నారు. ఈ విషయంలో తాము సింపుల్ బయాలాజికల్ రియాలిటీ ఫార్ములాను అనుసరిస్తోన్నామని చెప్పారు. ఇమ్మిగ్రేషన విధానం అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, ఇందులో అప్రమత్తంగా ఉండక తప్పదని పేర్కొన్నారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదనేది తమ విధానపర నిర్ణయమని వ్యాఖ్యానించారు.
మెరుగైన జీవన ప్రమాణాల కోసం
మహిళలు, పిల్లల ప్రయోజనాలు, వారికి భద్రత కల్పించడం, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల మెరుగుపర్చే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ట్రైసియా మెక్‌లాఘ్లిన్ అన్నారు. భద్రత వ్యవస్థ తమ దేశ పౌరులకు హాని కలిగించేలా ఉండే ఏ అంశాన్నయినా తీవ్రంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు, వాటి అనుబంధ డాక్యుమెంట్లల్లో మేల్, ఫిమేల్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. థర్డ్ జెండర్ ఆప్షన్‌ను తొలగించింది. దీన్ని నిర్ధారించడానికి జనన ధృవీకరణ పత్రాలను ప్రామాణికంగా తీసుకుంటామని మెక్‌లాఘ్లిన్ వివరించారు.