ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. సంక్షేమం – అభివృద్ధి కి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసారు. బడ్జెట్ ప్రతిపాద నలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనల ను సభకు ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధుల కేటాయింపులు చేసారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు కేటాయించినట్లు సమాచారం.
తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్
3.24 లక్షల కోట్ల అంచనాతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీ లో ప్రవేశ పెడుతున్నారు. దాదాపు 3 లక్షల 24 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్ట నున్నట్లు సమాచారం. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ సమర్పిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు కేశవ్ బడ్జెట్ ప్రతులను అందించారు.

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీలకు నిధులు
సంక్షేమానికి నిధులు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేసారు. బడ్జెట్ ప్రతులతో అమరావతి లోని వెంకటాయపాలేనికి వెళ్లిన ఆర్థికమంత్రి పయ్యావుల అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం నిధుల కేటాయింపు చేసినట్లు సమాచారం.
మూడు విడతల్లో రైతు భరోసా
మూడు విడతల్లో రైతు భరోసా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తో కలిపి మూడు విడతలుగా వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలుకు వీలుగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు సమా చారం. అదే విధంగా తల్లికి వందనం పథకాన్ని మే మాసంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం పథకం నిర్వహణ అంచనాలకు తగిన విధంగా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ ప్రతిపాదన పూర్తయిన తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం కానున్నారు.