నారా భువనేశ్వరి నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విజయవాడ కేంద్రంగా తన సేవలను మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో నేడు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ట్రస్ట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇది మరో మైలురాయి అని నారా భువనేశ్వరి అభివర్ణించారు.

సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పేదలకు, అభాగ్యులకు సాయం అందించే మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ నేడు విజయవాడలో సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న వేళ నారా భువనేశ్వరిని, ట్రస్ట్ నిర్వాహకులను అభినందిస్తున్నానని తెలిపారు. “28 ఏళ్ల కిందట స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోట్లాది మందిని విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడమే కాకుండా, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్… సేవా కార్యక్రమాలు చేసేవారికి స్ఫూర్తినిస్తోంది. తలసేమియా బాధిత పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఎన్టీఆర్ ట్రస్ట్ తన సేవలను విస్తరించే క్రమంలో జరిగిన నేటి నూతన భవన శంకుస్థాపన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ మెంట్ కు, సిబ్బందికి, దాతలకు అభినందనలు తెలుపుకుంటున్నాను” అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.