దాదాపు రెండు దశాబ్ధాల కిందట ఐటీ రంగం ప్రాముఖ్యతను దేశంలో ముందుగా గ్రహించి అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోలను కూడా హైదరాబాదుకు తీసుకొచ్చిన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో దానికి మించిన వృద్ధిని సాధించటానికి కొత్త ఆలోచనతో వున్నారు. ఇప్పటికే దేశంలో ఐటీ నుంచి స్టార్టప్స్ వరకు వివిధ రంగాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీలో తగ్గేదేలే అని సీఎం చంద్రబాబు కొత్త ఆలోచనతో వచ్చారు. ఏపీలో మహిళా నిపుణులను సాధికారపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశాలను పెంచాలని నిర్ణయించారు.
మహిళల భాగస్వామ్యాన్నిపెంచేందుకు కృషి
వాస్తవానికి కరోనా సమయంలో అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని చెప్పటంతో చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కారణం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమస్యలేనని తేలింది. అయితే ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి పెంచేందుకు ఏపీ సీఎం ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ వంటి రంగాల్లో వీరి భాగస్వామ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.

యువతకు అందుబాటులోకి ..
దీనికి ముందు సైతం గతంలో సీఎం చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఫ్రమ్ హోం ఆపర్చునిటీలను ఆంధ్రప్రదేశ్ యువతకు అందుబాటులోకి తీసుకురావటానికి తాము కృషి చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వాస్తవానికి ఇదొక వినూత్న ఆలోచన. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ ఆలోచనతో ముందుకు రాలేదు. ప్రపంచానికి ఏపీ నుంచి రిమోట్ వర్క్ ఫోర్స్ సప్లై చేయటం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలను అందిస్తుందన్నారు.
కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది
ఇదే సమయంలో చంద్రబాబు ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0ను తీసుకొచ్చారు. వీటి ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉపయోగించుకుంటూ పెద్ద అడుగులు వేయాలని నాయుడు ప్లాన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఏపీలో ఐటీ పరిశ్రమతో పాటు జీసీసీల ఏర్పాటుతో కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలకాలని ఆయన చూస్తున్నారు.