జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించబోగా, ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉండటంతో ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నారు.

‘యోగాంధ్ర – 2025’
ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ‘యోగాంధ్ర – 2025’ అనే థీమ్‌ను ప్రకటించారు. దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం పాటించాలి. ఈ నెల రోజులూ రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగాభ్యాసం జరగాలి. దీన్ని పూర్తిచేసుకున్న వారిని గుర్తిస్తూ ధ్రువపత్రం ఇవ్వాలి. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా దినోత్సవంలో పాల్గొనే ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని కనీసం 2 కోట్ల మందికి చేరేలా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలను ముందస్తుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించి, వారికి ధ్రువపత్రాలు కూడా అందించాలనే దిశగా సూచనలు ఇచ్చారు.
విశాఖలో ప్రధాని పాల్గొననున్న భారీ వేడుక
ఆర్‌కే బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజలు పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 68 ప్రాంతాల్లో 2,58,948 మందికి యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్‌కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, క్రీడా, నేవీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు.
విద్యార్థులకు ప్రత్యేక స్థానం
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. యువత ద్వారా యోగాను సమాజంలో విస్తృతంగా వ్యాపింపజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారం తీసుకోవాలి. ఈ 11వ యోగా దినోత్సవం పదేళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి అని చంద్రబాబు సూచించారు. 5 లక్షల మంది పాల్గొనేలా ఆర్‌కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలన్నింట్లో కార్యక్రమం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
సూరత్ రికార్డు కొత్త మైలురాయి లక్ష్యం
2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 36వేల మందితో ఒకే వేదికపై నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. తొలి ఏడాది 84 దేశాల్లో యోగాను నిర్వహించారు. ప్రపంచంలోని 170కి పైగా దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 2023లో సూరత్‌లో 1,53,000 మందితో నిర్వహించి మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా గమనించదగిన కార్యక్రమంగా నిలవబోతుంది.
Read alos: Rain Alert: ఆంధ్రలో కొన్ని జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన