Satellite toll : కేంద్రప్రభుత్వం శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలుపై క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఫాస్టాగ్ ఆధారిత టోల్ విధానం స్థానే శాటిలైట్ టోల్ విధానాన్ని మే 1 నుంచే అమలు చేయబోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీనిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇ-నోటీసులు
ఈ ప్రకటన ప్రకారం.. ఫీజు వసూలుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద అమరుస్తారు. ఇందులో ఏఎన్‌పీఆర్‌తో పాటు ఫాస్టాగ్ కలగలిపి సేవలందిస్తారు. అంటే ఏఎన్పీఆర్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్లను గుర్తిస్తే.. వాహనాలు ఆగకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేస్తారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇ-నోటీసులు జారీ చేస్తారు. ఫాస్టాగ్ రద్దు, పెనాల్టీలు విధిస్తారు. ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ శాఖ తెలిపింది.