ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య సాగిన హోరాహోరీ పోరు పోలింగ్ తర్వాత కూడా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కత్తులు దూసుకున్న పార్టీలు, నేతలు ఇప్పుడు పోలింగ్ ముగిశాక కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగిస్తున్నారు. అంతే కాదు ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ చేసిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఆరోపణలు ఓవైపు కౌంటింగ్ కు ముందు కలకలం రేపుతుండగా.. ఇప్పుడు వాటిపై కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించడం మరింత హీట్ పెంచుతోంది.

ఢిల్లీలో పోలింగ్ తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక భాగం ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగిందని తేల్చేశాయి.వీటిని కేజ్రివాల్ పార్టీ ఆప్ తోసిపుచ్చింది. అయితే ఎందుకైనా మంచిదని అనుకున్నారో ఏమో తమ ఎమ్మెల్యే అభ్యర్ధుల్ని బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కేజ్రివాల్ ఆరోపణలు మొదలుపెట్టారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్ధికి రూ.15 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై బీజేపీ ఫైర్ అయింది. ఈ ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చించింది. అయినా కేజ్రివాల్ తగ్గలేదు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రంగంలోకి దిగారు. కేజ్రివాల్ చేసిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఆరోపణలపై విచారణ జరపాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేజ్రివాల్ ఆరోపణలు తీవ్రమైనవని, వీటిపై దర్యాప్తు ప్రారంభించాని ఢిల్లీ ఏసీబీ అధికారుల్ని ఆయన ఆదేశించారు. కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ బృందం ఇవాళ ఆయన సివిల్ లైన్స్ నివాసానికి చేరుకుంది. ఆప్ తన సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ కేజ్రివాల్ చేస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. దీంతో శనివారం ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కంటే ముందే అటు కేజ్రివాల్, ఇటు బీజేపీ ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రేపు ఏదైనా తేడా వచ్చినా రాజకీయంగా ఇబ్బందుల్లేకుండా చూసుకోవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.