ప్రపంచమంతా రంజాన్ సీజన్లో హ్యాపీగా ఉంటే గాజాలో మాత్రం మారణహోమం జరుగుతున్నది. గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 69 మంది దుర్మరణం పాలయ్యారు.

కాల్పుల విరమణ కుదిరిన ఒప్పందం
నిజానికి- హమాస్‌తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్. దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది షరతు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయడానికి కాల్పుల విరమణ కుదిరిన రెండు నెలల తర్వాత ఈ దాడులు తెరమీదికి వచ్చాయి. ఈ రెండు నెలల వ్యవధిలో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో దాదాపు 60 మందిని విడుదల చేసింది హమాస్.
69 మంది మరణించారు
ఈ పరిస్థితుల్లో తాజా దాడులు చోటు చేసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. గాజా అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇప్పటివరకు 69 మంది మరణించినట్లు గాజా ప్రకటించింది. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని స్థానిక మీడియా తెలిపింది.