చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని కోర్టులో జరుపర్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. నిన్నరాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసిన తర్వాత పోసానిని రాయలసీమలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకి తీసుకొచ్చిన పోలీసులు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలీసుల విచారణకు పోసాని
అయితే పోసానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతానికి పోసాని హెల్త్ కండిషన్ నార్మల్‌గా ఉందని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. పోసానికి గుండెసంబంధిత సమస్యలున్నాయని, హార్ట్‌కు సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారని గుర్తించారు. అలాగే వైద్య పరీక్షల తర్వాత పోలీసుల విచారణకు పోసాని సిద్ధమయ్యారని మెడికల్ ఆఫీసర్ గురుమహేష్ వెల్లడించారు. ఈ విచారణ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరు పర్చబోతున్నారు.
అన్నమయ్య జిల్లాకు లాయర్
మరోవైపు పోసాని అరెస్టు తర్వాత ఆయనకు అండగా ఉండేందుకు పలువురు వైసీపీ నేతల్ని, లాయర్లను అధినేత జగన్ అన్నమయ్య జిల్లాకు పంపినట్లు తెలుస్తోంది. పోసాని భార్య కుసుమలతో ఫోన్లో మాట్లాడిన జగన్.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పలువురు లాయర్లను ఆయన వద్దకు పంపుతున్నట్లు తెలిపారు. అటు హైకోర్టు లాయర్ బాల కూడా పోసాని అరెస్టుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు పోసానిని ఉంచిన ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ కు వచ్చిన వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారితో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.