అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ అస్త్రాన్ని మరోసారి ప్రయోగించారు. ఈసారి ఆసియా దిగ్గజం దక్షిణ కొరియాను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. గతేడాది కుదుర్చుకున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేయడంలో దక్షిణ కొరియా విఫలమైందని ఆరోపిస్తూ.. ఆ దేశ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం.. అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతేడాది జూలైలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అమెరికాలో దక్షిణ కొరియా సుమారు 350 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ముఖ్యంగా అమెరికన్ షిప్‌యార్డ్‌లను పునరుద్ధరించడం ఇందులో కీలక భాగం. అయితే ఈ ఒప్పందానికి దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీ ఇంకా ఆమోదం తెలపలేదు. “దక్షిణ కొరియా శాసనసభ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లేదు. అమెరికా తన వంతుగా సుంకాలను తగ్గించినప్పటికీ.. భాగస్వామ్య దేశం నుంచి అదే స్పందన రావడం లేదు” అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఈక్రమంలోనే అన్ని రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి ఏకంగా 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
Read Also: Lokesh : టీడీపీ పతనానికి లోకేశ్ నాంది కాబోతున్నారు – అంబటి

కొరియా ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు
ట్రంప్ నిర్ణయంపై దక్షిణ కొరియా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తమకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా పరిశ్రమల శాఖ మంత్రి కిమ్ జంగ్-క్వాన్, త్వరలోనే అమెరికాకు చేరుకుని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్తో చర్చలు జరపనున్నారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు కొరియా ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ట్రంప్ (Trump) అడ్మినిస్ట్రేషన్ కేవలం దక్షిణ కొరియానే కాకుండా యూరోపియన్ దేశాలు, కెనడా వంటి మిత్రదేశాలపై కూడా టారిఫ్ బెదిరింపులకు దిగుతోంది. గతంలో జార్జియాలోని హ్యుందాయ్ ప్లాంట్‌పై ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు చేసిన ఘటనతో అమెరికా-కొరియా సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇప్పుడు తాజా సుంకాల విధింపుతో దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. మిత్ర దేశాలైనా, శత్రు దేశాలైనా అమెరికా ప్రయోజనాలే ముఖ్యమనే తన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: