జియో నుంచి కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లకు మాత్రమే కొత్త చౌక ప్లాన్లు: TRAI ఆదేశాలపై స్పందనగా నిర్ణయం
ఇటీవల టెలికాం నియంత్రణ సంస్థ అయిన ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా – ట్రాయ్) అన్ని టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా డేటా వినియోగం అవసరం లేని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని, కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్ సౌకర్యాలతో కూడిన చౌక ధరల రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ స్పష్టమైన సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారుల కోసం రెండు సరికొత్త చౌక ప్లాన్లను ప్రకటించింది. డేటా అవసరం లేని, తక్కువ వినియోగం చేసే కస్టమర్లకు వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు గలదిగా, రూ.1958 ప్లాన్ ఏడాది కాలం పాటు చెల్లుబాటు అయ్యే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

రూ. 458 ప్లాన్ – 84 రోజుల చెల్లుబాటు, అపరిమిత కాలింగ్‌తో జియో ఆఫర్
రూ. 458 ప్రీపెయిడ్ ప్లాన్‌ను జియో విడుదల చేసింది. ఇది మొత్తంగా 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కి అయినా అపరిమితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 1,000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఇందులో లభిస్తాయి. జాతీయ రోమింగ్ సౌకర్యం కూడా ఉచితంగా ఉంటుంది. ఈ ప్లాన్ డేటా పరంగా ఎలాంటి ప్రయోజనాలను అందించదు. అంటే డేటా అవసరం లేని లేదా చిన్నపాటి మొబైల్ యూజర్లకు ఇది అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. దీనితో పాటు జియో వినియోగదారులకు జియో సినిమా (Jio Cinema), జియో టీవీ (JioTV) వంటి యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
రూ. 1958 ప్లాన్ – 365 రోజుల వ్యాలిడిటీతో దీర్ఘకాలిక ప్రయోజనాలు
జియో విడుదల చేసిన మరొక ప్లాన్ రూ. 1958 ధరకు లభిస్తుంది. ఇది పూర్తిగా ఏడాది కాలం పాటు అంటే 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కి అయినా అపరిమితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తం 3,600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఇందులో భాగంగా లభిస్తాయి. జాతీయ స్థాయిలో ఉచిత రోమింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా డేటా ప్రయోజనాలను కలిగి ఉండదు. దీర్ఘకాలికంగా తక్కువ ఖర్చుతో ఫోన్ కాల్స్ మరియు ఎస్‌ఎంఎస్ అవసరాలను తీర్చుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలవనుంది. ఇదే కాకుండా జియో యాప్‌లైన జియో సినిమా, జియో టీవీ వంటివాటిని కూడా వినియోగదారులు ఉచితంగా వినియోగించవచ్చు.
పాత ప్లాన్లకు గుడ్‌బై: రూ.479, రూ.1899 ప్లాన్లను విరమించిన జియో
ఈ రెండు కొత్త ప్లాన్లను విడుదల చేయడంతో పాటు జియో గతంలో అందుబాటులో ఉంచిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా విరమించింది. వాటిలో రూ.479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6 జీబీ డేటాను అందించేది. అలాగే రూ.1899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 336 రోజుల వ్యాలిడిటీతో పాటు 24 జీబీ డేటా అందించబడుతున్నది. అయితే ఈ రెండు ప్లాన్లను మార్కెట్ నుంచి తొలగిస్తూ, కొత్తగా కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌కు మాత్రమే ఉద్దేశించిన ప్లాన్లపై దృష్టి సారించింది.
ఇది TRAI ఆదేశాల మేరకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం కాగా, వినియోగదారుల అవసరాలను బట్టి కంపెనీలు తమ ప్లాన్లను మలుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. డేటా వినియోగం తక్కువగా ఉండే పెద్దవయసు వారు, బేసిక్ మొబైల్ ఫోన్లు వాడేవారు లేదా బిజినెస్ పర్పస్ కోసం సెకండరీ నెంబర్లు వాడే వారు ఈ ప్లాన్లను ప్రధానంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Read also: Stock markets: కాల్పుల విరమణతో భారీగా లాభాలు అందుకున్న స్టాక్ మార్కెట్లు