ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంకుల మధ్య సేవా ఛార్జీల విషయంలో పెద్ద తేడాలు ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ రూ.10 వేలుగా ఉండగా, మరికొన్నింటిలో రూ.15 వేల వరకు ఉంది. అలాగే ఏటీఎం వినియోగం, వార్షిక ఫీజులు కూడా బ్యాంకు బ్యాంకుకు భిన్నంగా ఉన్నాయి. అయితే ఈ గందరగోళానికి త్వరలో ముగింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: SBI: ఎస్‌బీఐ వినియోగ దారులకు శుభవార్త.. రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు

అన్ని బ్యాంకులకు ఒకే సేవా ఛార్జీ విధానం?
కస్టమర్లపై పడుతున్న అదనపు భారం తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Guidelines) కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఖాతా ఏ బ్యాంకులో ఉన్నా, సేవా రుసుములు ఒకే విధంగా ఉండేలా ప్రామాణిక ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. దీని వల్ల భవిష్యత్తులో వేర్వేరు బ్యాంకులకు వేర్వేరు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
రుణాల ప్రాసెసింగ్ ఛార్జీలపై స్పష్టత
కొత్త ప్రతిపాదనల ప్రకారం, రుణం కోసం దరఖాస్తు చేసిన దశ నుంచి మంజూరు లేదా తిరస్కరణ వరకు వసూలు చేసే అన్ని ప్రాసెసింగ్ ఛార్జీలను కస్టమర్లకు ముందుగానే స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు పూర్తి అవగాహన కలుగుతుందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.
కనీస బ్యాలెన్స్ జరిమానాలపై పునఃసమీక్ష
కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు విధిస్తున్న జరిమానాలపై కూడా ఆర్బీఐ (RBI Guidelines)పునఃపరిశీలన చేపట్టే అవకాశముంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ జరిమానాలను ఉపసంహరించుకున్నాయి. అయినప్పటికీ, 2024–25 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2,175 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేసినట్లు రాజ్యసభకు తెలియజేశారు.
కస్టమర్ సేవకే ప్రాధాన్యం – ఆర్బీఐ గవర్నర్
ఇటీవల ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) మాట్లాడుతూ, కస్టమర్ సేవలను మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు అవసరమైన అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బ్యాంకులు తమ అన్ని శాఖల్లో అందించే సేవల పూర్తి జాబితాను రూపొందించి అందించాలని కూడా ఆర్బీఐ సూచించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను బ్యాంకులు సమీక్షిస్తున్నాయని, త్వరలో తమ అభిప్రాయాలను తెలియజేయనున్నాయని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :