Income Tax Bill 2025 : ఆగస్టు 11, 2025న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన ‘ఆదాయ పన్ను బిల్లు, 2025’కు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి సంతకం తర్వాత 2026 ఏప్రిల్ 1 నుంచి ‘ఆదాయ పన్ను చట్టం, 2025’గా అమల్లోకి వస్తుంది. సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే సరళతర విధానాలతో ఈ బిల్లు రూపొందింది.
రిఫండ్స్, టీడీఎస్‌పై సరళతర నిబంధనలు
ఈ బిల్లులో అత్యంత ముఖ్యమైన అంశం రిఫండ్స్‌కు సంబంధించిన సరళీకరణ. అనారోగ్యం లేదా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినా రిఫండ్స్ యథావిధిగా అందుతాయి. టీడీఎస్ వివరాల ఆలస్య సమర్పణపై జరిమానాలు ఉండవు. అలాగే, టీడీఎస్ పరిధిలోకి రాని వారు ‘నిల్ టీడీఎస్’ సర్టిఫికెట్ ముందుగానే పొందే సౌకర్యం కల్పించారు.
పెన్షనర్లకు శుభవార్త: ఏకమొత్తం పెన్షన్‌పై మినహాయింపు
ఈ బిల్లు పెన్షనర్లకు కీలక ప్రయోజనాలను అందిస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న కమ్యూటెడ్ పెన్షన్‌పై పన్ను మినహాయింపును, ఇకపై ఎల్ఐసీ వంటి ఫండ్ల నుంచి ఏకమొత్తం పెన్షన్ తీసుకునే ఉద్యోగేతరులకు కూడా వర్తింపజేస్తారు. ఈ మార్పు లక్షలాది పెన్షనర్లకు ఆర్థిక ఊరటను కల్పిస్తుంది.

గృహ ఆస్తి ఆదాయంపై స్పష్టత
గృహ ఆస్తి ఆదాయంపై పన్ను లెక్కింపులో స్పష్టతనిచ్చే నిబంధనలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. మున్సిపల్ పన్నులు పోగా, మిగిలిన వార్షిక ఆదాయంపై 30% స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉంటుంది. ఇంటి నిర్మాణం, కొనుగోలు, మరమ్మతుల కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీని కూడా మినహాయించుకోవచ్చు. అద్దె ఆదాయం విషయంలో, వాస్తవ అద్దె లేదా సముచిత అద్దెలో ఏది ఎక్కువో దానిని ఆదాయంగా పరిగణిస్తారు.
పన్ను శ్లాబులలో మార్పులు లేవు
ఈ బిల్లు సరళతర విధానాలను ప్రతిపాదిస్తున్నప్పటికీ, ప్రస్తుత ఆదాయ పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సంస్కరణలు పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో రూపొందాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :