దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) (GST) వసూళ్ల జోరుకు జూన్‌లో స్వల్ప బ్రేక్ పడింది. గత రెండు నెలలుగా రెండు లక్షల కోట్ల వసూళ్లు నమోదైనప్పటికీ, జూన్‌లో (In June) మాత్రం ఆ స్థాయిని చేరలేకపోయాయి.కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం, 2025 జూన్ నెలలో మొత్తం రూ.1.85 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది జూన్‌తో పోలిస్తే 6.2 శాతం అధికం. అయినప్పటికీ, మునుపటి రెండు నెలలతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గింది.గత ఏప్రిల్‌లో రూ.2.37 లక్షల కోట్లు, మేలో రూ.2.01 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఈ రెండు నెలలు జీఎస్టీ వసూళ్లలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాయి. అదే దూకుడు జూన్‌లో కొనసాగలేదు.
జీఎస్టీ అమలుకు 8 ఏళ్లు పూర్తి
జీఎస్టీ అమలు దేశవ్యాప్తంగా 2017 జులై 1న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మలుపుగా నిలిచింది. ఈ ఏడాది జూలై 1 నాటికి జీఎస్టీ విజయవంతంగా 8 ఏళ్లు పూర్తయింది.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమాచారం విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.37 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు, 2024-25 నాటికి రూ.20.08 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. అంటే గత ఐదేళ్లలో వసూళ్లు దాదాపు రెట్టింపు అయ్యాయి.కేంద్రం ప్రకారం, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలు, బిలింగ్ కట్టుబాట్లు, ఈ-ఇన్వాయిసింగ్ విధానం వల్లే వసూళ్లు పెరిగాయని చెబుతోంది. వినియోగంలో పెరుగుదల, పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం కూడా వృద్ధికి తోడ్పడింది.
ముందు నెలలతో పోలిస్తే మాత్రం స్వల్ప తగ్గుదల
జూన్ నెల వసూళ్లు తక్కువగా నమోదు కావడం వెనుక, కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక క్రియాశీలత తగ్గడం కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినా, జీఎస్టీ వ్యవస్థ స్థిరంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం.జీఎస్టీ వసూళ్లు గతంతో పోలిస్తే పెరిగినా, మునుపటి నెలల రికార్డుల్ని జూన్ అందుకోలేకపోయింది. జూలై నుంచి వసూళ్లు మళ్లీ పెరుగుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
Read Also : Stock market: స్వల్ప లాభాల్లోనే స్టాక్ మార్కెట్ సరి..