దేశవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ (Unified Payments Interface) సేవలపై త్వరలో ఛార్జీలు విధించనున్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులు ఈ వార్తలతో అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) తాజాగా స్పష్టతనిస్తూ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని ప్రకటించింది.
Chandrababu : పనిచేయకుంటే ప్రజల ముందు నిలబెడతా: CBN
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ చెల్లింపులపై ఛార్జీల వసూళ్లకు సంబంధించిన ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం, RBI ఉద్దేశపూర్వకంగా యూపీఐ సేవలను ఉచితంగా కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు. చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులు సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయగలగడం కోసం ఇప్పటివరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో వినియోగదారుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలు తొలగిపోయాయి.

అయితే యూపీఐపై RBI ఎలాంటి ఛార్జీలు విధించకపోయినా, కొన్ని యాప్లు తమ సేవలకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్ ఫీజులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి RBI నిర్ణయాలు కాకుండా ఆయా యాప్ సంస్థల స్వతంత్ర వ్యాపార విధానాల భాగం. అంటే యూపీఐ సదుపాయం ఉచితంగానే ఉంటుందిగాని, యాప్ల అందించే అదనపు సర్వీసులు, ఫీచర్ల కోసం మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయి. ఈ వివరణతో వినియోగదారులు నిజమైన పరిస్థితిని అర్థం చేసుకొని భయపడకుండా డిజిటల్ చెల్లింపులను కొనసాగించవచ్చు.