ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేశ్ సోలంకి (22) కుక్కపిల్ల కరిచిన కారణంగా రేబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. బ్రిజేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా గోల్డ్ మెడల్ కూడా పొందాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్ ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సోలంకి రాష్ట్ర స్థాయి కబడ్డీలో రాణిస్తూ ప్రో కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే, రెండు నెలల కిందట ఓ కుక్క పిల్ల డ్రైనేజీలో పడటంతో బ్రిజేశ్ దానిని కాపాడే ప్రయత్నం చేశాడు. డ్రైనేజీ నుంచి కుక్క పిల్లని బయటకు తీస్తున్న సమయంలో అది అది చేతిని కొరికింది. అయితే, దాన్ని బ్రిజేశ్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వ్యాక్సిన్ కూడా చేయించుకోలేదు.
రేబిస్ వ్యాధి సోకిందని నిర్థారించారు
ఇటీవల కొద్ది రోజులుగా బ్రిజేశ్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. నీళ్లను చూస్తే చాలా భయపడిపోతున్నాడు. దాంతో కుటుంబ సభ్యులు బ్రిజేశ్‌ను వెంటనే దగ్గరలోని హాస్పిటల్స్‌తో పాటు ఢిల్లీలో కూడా చూయించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. చివరగా నోయిడా ఆస్పత్రిలో చూయించడంతో బ్రిజేశ్ (Brijesh) కు రేబిస్ వ్యాధి సోకిందని నిర్థారించారు. వ్యాధి ముదరడంతో శనివారం రోజు మృతిచెందగా, సోమవారం అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.బ్రిజేశ్ చనిపోవడానికి ముందు రేబిస్ వ్యాధితో బాధపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియో బ్రిజేశ్ మతి చెలించినట్లు ప్రవర్తించడంతో పాటు వింత శబ్దాలు కూడా చేశాడు. బ్రిజేశ్ మృతిచెందడంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ పరిసర ప్రాంతాల్లో చాలా మందికి రేబిస్ వ్యాక్సిన్ వేశారు.
అంతా ఒక్కసారిగా జరిగిపోయింది
కుక్క పిల్ల కరిచిన సమయంలో తన మోచేతి వద్ద ఏదో నొప్పిగా అనిపించింది. అయితే అది ప్రాక్టీస్‌లో గాయంలా అనుకుని వదిలేశాడు. కనీసం వ్యాక్సిన్ కూడా చేయించుకోలేదు అని బ్రిజేశ్ కోచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. “అంతా ఒక్కసారిగా జరిగిపోయింది. జూన్ 26న హఠాత్తుగా నీళ్లను చూసి భయపడ్డాడు. రేబిస్ (Rabies) వస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అచ్చం అలాగే అయిపోయాడు. మేం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లాం. ఢిల్లీకి కూడా వెళ్లాము కానీ నోయిడా డాక్టర్లే రేబిస్ వ్యాధి భారిన పడ్డాడని నిర్థారించారు” అంటూ బ్రిజేశ్ సోదరుడు సందీప్ కుమార్ వివరించాడు.
వ్యాక్సిన్ తీసుకుంటే
ఈ ఘటనపై హైదరాబాద్, హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి. శివకుమార్ మాట్లాడుతూ రేబిస్ లక్షణాలు (Symptoms of Rabies) కనిపించాక ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యమని స్పష్టం చేశారు. “కుక్క లేదా ఏదైనా జంతువు కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటే రేబిస్‌ను 100 శాతం నివారించవచ్చు. లక్షణాలు బయటపడ్డాక చికిత్సకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది” అని పేర్కొన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కుక్క లేదా ఏదైనా జంతువు కరిచిన వెంటనే ఆ గాయాన్ని సబ్బు, నీటితో కనీసం 10-15 నిమిషాల పాటు శుభ్రంగా కడగాలని డాక్టర్ శివకుమార్ (Dr. Sivakumar) సూచించారు. అనంతరం వెంటనే వైద్యులను సంప్రదించి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవాలని నొక్కి చెప్పారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నా సరే, వ్యాక్సిన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: World Boxing: వరల్డ్ బాక్సింగ్ సెమీఫైనల్లో హితేశ్, సాక్షి దూకుడు