గబాన్ అధ్యక్ష ఎన్నికల్లో సైనిక నాయకుడు బ్రైస్ ఒలిగి ఎన్‌గుయేమా ఘన విజయం సాధించారు. గబాన్‌లో 2023లో జరిగిన సైనిక తిరుగుబాటు కు నాయకత్వం వహించిన ఎన్‌గుయేమా అధ్యక్ష ఎన్నికల్లో 90 శాతం ఓట్లతో భారీ విజయం సాధించారని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తిరిగి ప్రజలకు ఇచ్చేందుకు కృషి
ఈ ఎన్నికల్లో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీపడగా వారిలో ఎన్‌గుయేమా ప్రధాన ప్రత్యర్థి అయిన అలియన్ క్లాడ్ బిలీ బై ఎన్‌జేకు కేవలం 3 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా ఆరుగురు అభ్యర్థులకు ఆ మాత్రం ఓట్ షేర్ కూడా దక్కలేదు. విజయం ప్రకటితమైన అనంతరం ఎన్‌గుయేమా మీడియాతో మాట్లాడుతూ.. గబాన్ ప్రజల గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. గత పాలకులు ప్రజల నుంచి దోచుకున్నది అంతా తిరిగి ప్రజలకు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.