తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈనెల 8న హైకోర్టు (High Court) వెలువరించనున్న తీర్పుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన GO-9కి చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు 22 శాతం నుండి 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తుందా, లేక నిలిపివేస్తుందా అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ తీర్పు ఆధారంగా స్థానిక ఎన్నికల భవిష్యత్తు కొంతమేరకు నిర్ణయించబడనుంది.
Latest News: TG: తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు
ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జడ్జిమెంట్ వ్యతిరేకంగా వచ్చినా చట్టపరమైన పరిమితుల్లోనే బీసీలకు కనీసం 22 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తూనే మరో 20 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ఒకవైపు చట్టపరంగా సురక్షితంగా ఉండటంతోపాటు బీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు బీసీ సమాజంలోనూ, ప్రతిపక్ష పార్టీలలోనూ చర్చనీయాంశంగా మారాయి.

తీర్పు ఎలా వచ్చినా స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తగిన ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ తీర్పు వెలువడిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల తుది రూపురేఖలు స్పష్టమవుతాయి. ఫలితంగా ఈనెల 8న వెలువడబోయే హైకోర్టు తీర్పుపై మాత్రమే కాకుండా, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా రాష్ట్రవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతోంది.