ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా మహీంద్ర గ్రూప్‌ను ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ పరిశ్రమకు అనువైన వాతావరణం ఉన్నందున, మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో తమ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు లోకేశ్ చేసిన ట్వీట్‌కి భారీ స్పందన లభించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలపై ఆనంద్ మహీంద్ర స్పందన
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) మంత్రి లోకేశ్ ట్వీట్‌కు తెలుగులోనే స్పందిస్తూ, ఏపీలో ఉన్న అవకాశాలను పలు రంగాల్లో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ‘‘ధన్యవాదాలు! ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉంది. సౌరశక్తి, సూక్ష్మ నీటిపారుదల, పర్యాటకం వంటి రంగాల్లో చర్చలు జరుగుతున్నాయి. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది’’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రముఖ కంపెనీలతో రాష్ట్రానికి పెట్టుబడుల ఉత్సాహం
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం ఆధారిత సాంకేతికత, పర్యాటక రంగాలపై రాష్ట్రం దృష్టి సారించిందని తెలుస్తోంది. ఆనంద్ మహీంద్ర స్పందనతో రాష్ట్ర పెట్టుబడుల రంగంలో ఆశాజనకమైన వాతావరణం ఏర్పడుతోందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : HHVM : ‘హరి హర వీరమల్లు’ టికెట్ రేట్లు పెంపు