ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు ముఖ్యంగా రాష్ట్రాల శాసన సభల్లో రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆలస్యం చేయకుండా నిర్ణయించాల్సిన అవసరం ఉన్నదనే అంశం దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయ, మరియు పౌర సవాళ్లను తేచ్చింది. ఈ పరిణామాల్లో వివిధ రాజ్యాంగ సంస్థల మధ్య అధికార పరిమితులు, సమతుల్యతపై చర్చ మళ్లీ చెలరేగింది. రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీం కోర్టు ఇటీవలే గడువు నిర్దేశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ పాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. అయితే తాజాగా వీటిపై కాబోయే సీజేఐ స్పందించారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం
తమిళనాడులో శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా అలాగే ఉంచారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాప్రతినిధుల ఆధీనంలో ఉండే శాసన వ్యవస్థ నిర్ణయాలను గవర్నర్ అడ్డుకోవడం ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధానాంశాలు:
రాష్ట్ర గవర్నర్‌కు బిల్లులను నిలిపివేసే అధికారం పరిమిత కాలానికి మాత్రమే ఉండాలని తెలిపింది. బిల్లును ఆమోదించాలన్నా తిరస్కరించాలన్నా గడువు మించకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మంత్రుల మండలి సలహా మేరకు రాష్ట్రపతికి పంపితే గడువు ఒక నెల మాత్రమేనని పేర్కొంది. గవర్నర్ ఆలస్యాన్ని కోర్టులు సమీక్షించవచ్చని తెలిపింది. ఈ తీర్పుతో కార్యనిర్వాహక వ్యవస్థపై న్యాయ వ్యవస్థ జోక్యం పెరిగిందని భావిస్తున్న నేతలు ముఖ్యంగా బీజేపీ శ్రేణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ వ్యాఖ్యలు
ఇలా సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వగా ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ స్పందించారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదని ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని సుప్రీం కోర్టు ప్రయోగించరాదని అన్నారు. శాసించే జడ్జులు ఉన్నారని, కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తిస్తారంటూ కామెంట్లు చేశారు. మరోవైపు సుప్రీం కోర్టు చట్టాలు చేస్తే గనుక పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు
ఈక్రమంలోనే కాబోయే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగానే జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కుంటున్నామని చెప్పారు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు.
Read also: Judge: ఢిల్లీ కోర్టులోనే మహిళా జడ్జిని బెదిరించిన నిందితుడు