తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు సంబంధించి ప్రశంసనీయమైన స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 22 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో, మొదటి రోజు టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో జపాన్‌లోని భారత రాయబారి శిబు జార్జ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ఎంపీ కనిమొళి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ నెపోలియన్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లోని పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమై పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్చలు ప్రారంభించారు.
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం
ఈ పర్యటనలో ముఖ్య ఉద్దేశ్యంగా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం, సాంకేతిక సహకారంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం జైకా (జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్) ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 24,269 కోట్లను ఖర్చు చేయనుండగా, జైకా, ADB, NDB లాంటి అంతర్జాతీయ సంస్థల నుండి సుమారు 48% నిధులు రుణాలుగా పొందే యోచన ఉంది.

సోనీ గ్రూప్, జెట్‌రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వంటి సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు
పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోనీ గ్రూప్, జెట్‌రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వంటి సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థతోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని వివరించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి నూతన అవకాశాలను తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. జపాన్ పర్యటన తెలంగాణ అభివృద్ధి దిశగా ఒక కీలక మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.