భారత ప్రభుత్వం (India Govt) సుమారు రూ.85 వేల కోట్ల వ్యయంతో 112 క్రూడాయిల్ (Crude Oil) రవాణా నౌకలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మేరకు నౌకల కొనుగోలు ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడాయిల్ వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో, దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారీగా చమురు దిగుమతులు చేస్తున్న భారత్
దేశీయంగా పెరుగుతున్న చమురు అవసరాలను తీర్చడానికి భారత్ భారీగా చమురు దిగుమతులు చేసుకుంటోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఉద్భవించే వివిధ రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో, ఇతర దేశాలపై ఆధారపడకుండా నౌకల స్వయంప్రాప్తి అవసరమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంత రవాణా నౌకల సదుపాయం ఉంటే, అత్యవసర పరిస్థితుల్లోనూ చమురు సరఫరా అంతరాయం లేకుండా సాగుతుంది.
2040 నాటికీ 112 నౌకలు అందుబాటులోకి
ఈ 112 నౌకలను 2040వ సంవత్సరానికి ముందు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారత్‌కు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి, ముఖ్యంగా చమురు దిగుమతుల విషయంలో ఖర్చు తగ్గించుకోవడం, సరఫరాలో స్వయం నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరగడం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. దీర్ఘకాలికంగా ఇది ఒక గేమ్‌చేంజర్‌గా మారే అవకాశముంది.