ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జులై మొదటి వారంలో కీలక విదేశీ పర్యటన(Foreign trip
)కు బయలుదేరనున్నారు. జులై 2 నుంచి 9 వరకు ఆయన ఐదు దేశాలు సందర్శించనున్నారు. ఇందులో భాగంగా మోదీ బ్రెజిల్‌లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అంతేకాదు, ఆప్రికా, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాల పర్యటనల ద్వారా భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సైప్రస్, కెనడా, క్రొయేషియా పర్యటనల అనంతరం మోదీ మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఘనా, ట్రినిడాడ్ టొబాగోలో చారిత్రాత్మక పర్యటనలు
మోదీ పర్యటనలో మొదటి ఆగమ్యం ఘనా. మూడు దశాబ్దాల తర్వాత భారత్ నుంచి అక్కడికి వెళ్లే తొలి ప్రధాని మోదీ కావడం గమనార్హం. ఇరుదేశాల మధ్య ఆర్థిక, రక్షణ, ఇంధన సహకారంపై కీలక చర్చలు జరుగనున్నాయి. అనంతరం ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటిస్తారు. 1999 తర్వాత ఆ దేశాన్ని సందర్శించే తొలి భారత ప్రధాని మోదీ. అక్కడ అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్ బిస్సేసర్ లతో సమావేశమవుతారు. మోదీ ఈ పర్యటనలో ఆ దేశ పార్లమెంట్‌కు సంయుక్తంగా ప్రసంగించే అవకాశముంది.
అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ద్వైపాక్షిక భవిష్యత్
ఆ తర్వాత మోదీ అర్జెంటీనాను సందర్శిస్తారు. ఇరుదేశాల మధ్య రక్షణ, వ్యవసాయం, మైనింగ్, గ్యాస్, వాణిజ్యం రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నారు. అక్కడ అధ్యక్షుడు జేవియర్ మిలే తో సమావేశమవుతారు. అనంతరం మోదీ జులై 5–8 వరకు బ్రెజిల్‌లో బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇతర దేశాధినేతలతో కీలక చర్చలు జరగనున్నాయి. చివరగా నమీబియాలో పర్యటించే ప్రధాని మోదీ, అధ్యక్షుడు నెతుంబో నంది నదిత్వా తో ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత దేశాన్ని గ్లోబల్ సౌత్‌లో ప్రభావవంతమైన నాయకుడిగా నిలిపే ప్రయత్నం జరుగుతోంది.
Read Also : RSS-BJPలకు రాజ్యాంగం అవసరం లేదు – రాహుల్