విశాఖపట్నం మరోసారి జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించనుంది. వచ్చే నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా విశాఖలో మేగాయోగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో విశాఖ వేదికగా దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘యోగాంధ్ర-2025’ నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.
దాదాపు 2 లక్షల మంది ప్రజలతో ఈ యోగా వేడుక
ఈ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కేఎస్ విజయానంద్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలతో ఈ యోగా వేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. విశాఖ నగరాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే పనులు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ ఈవెంట్ ద్వారా విశాఖ పేరు మరింత ప్రాచుర్యంలోకి
ఈ యోగా వేడుకకు ఆయుష్ మంత్రిత్వశాఖతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్‌లు తమ మద్దతు తెలియజేశాయి. దేశవ్యాప్తంగా యోగా మీద ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఈవెంట్ ద్వారా విశాఖ పేరు మరింత ప్రాచుర్యంలోకి రానుంది. ఆరోగ్య పరిరక్షణలో యోగాసనాల పాత్రను ప్రాచుర్యం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read Also : Permission : సులభతరంగా అనుమతుల ప్రక్రియ – సీఎం రేవంత్