శ్రావణ మాసం (Sravanamasam) వంటి ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చేసే పూజలు, వ్రతాలు, వాయినాల మార్పిడి గురించి అందరికీ తెలిసిందే. అయితే నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన యువకులు ఒక విభిన్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మహిళలు చేసే వాయినాల సంప్రదాయాన్ని తాము కూడా తమకనుగుణంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అసలు పూజలు మహిళలు చేస్తుండటంతో, తాము వినోదం కోసం ప్రత్యేకంగా “మగవారి వాయినాలు” జరపాలని నిర్ణయించారు.
మద్యం బాటిళ్లతో వినూత్న వాయినాల మార్పిడి
ముహూర్తం కుదుర్చుకుని గ్రామంలోని యువకులు ఒకచోట చేరి వాయినాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయ వాయినాల్లో లాగా బొట్లు పెట్టుకోవడం, కండువాలు కప్పుకోవడం వంటి పద్ధతులను పాటిస్తూ, వారు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే ఆ వాయినాల్లో పండ్లు, పూలు కాకుండా మద్యం బాటిళ్లే ప్రధానంగా మారాయి. స్నేహితులు ఒకరికి ఒకరు బాటిళ్లు అందిస్తూ సరదాగా వేడుకను కొనసాగించారు. ఈ వినూత్న ప్రయత్నం అక్కడి వారిలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది.
నవ్వులా, అవమానమా?
మగవారి వాయినాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరికి నవ్వులు తెప్పించాయి. అయితే మరికొందరు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల వ్రతాలు, సంప్రదాయాలను అనుకరించడం సరదా స్థాయిలో ఉండొచ్చేమో కానీ, వాటిని మద్యం బాటిళ్లతో కలపడం ద్వారా అవమానపరిచారని విమర్శలు వినిపిస్తున్నాయి. సంప్రదాయాలను కించపరిచే విధంగా కాకుండా సాంస్కృతిక విలువలకు భంగం కలిగించకుండా వినోదాన్ని కొనసాగించాలని పలువురు సూచిస్తున్నారు.