హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం (Rain) జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. కేవలం గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 11.13 సెం.మీ, సరూర్‌నగర్‌లో 10.6 సెం.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయం అయింది. లోతట్టు ప్రాంతాలు, బస్తీలు, కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
ప్రధాన రహదారులు జలమయం
ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట్ వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎల్బీనగర్, చార్మినార్ వంటి రద్దీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది.
ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు సహాయక చర్యలు
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నిలిచిపోయిన నీటిని తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఈ భారీ వర్షం నగరం యొక్క మౌలిక వసతులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
Read Also : Avocado : అవకాడోతో ఆడవాళ్లకు కలిగే లాభాలేంటో తెలుసా..